కేంద్రం × రైతులు: తొమ్మిదో‘సారీ’ 

వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య తొమ్మిదో విడత చర్చలూ అసంతపూర్తిగానే ముగిశాయి. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతులు పట్టుబట్టగా.. అందుకు కేంద్రం ససేమిరా అనడంతో ఈసారి .......

Updated : 16 Jan 2021 13:52 IST

19న మరో దఫా చర్చలు 

దిల్లీ: వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య తొమ్మిదో విడత చర్చలూ అసంపూర్తిగానే ముగిశాయి. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతులు పట్టుబట్టగా.. అందుకు కేంద్రం ససేమిరా అనడంతో ఈసారి కూడా చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో ఈ నెల 19న మధ్యాహ్నం 12గంటలకు మరోసారి సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతో పాటు కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలంటూ 41 రైతు సంఘాల ప్రతినిధులు కేంద్రమంత్రుల బృందాన్ని కోరారు. అయితే, రైతులు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై సవరణలు చేసేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర మంత్రులు చెప్పగా.. దీనిపై రైతు సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. చట్టాలను వెనక్కి తీసుకోవడం మినహా ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇందుకు రాజకీయ పార్టీల మద్దతు కావాలంటే తాము కూడగడతామని కూడా రైతు నేతలు చెప్పినట్టు సమాచారం.

హరియాణా, పంజాబ్‌ రైతులపై దర్యాప్తు ఏజెన్సీలు రకరకాల కేసులు బనాయిస్తున్న విషయాన్ని రైతు సంఘాల నేతలు కేంద్రమంత్రుల బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్‌ఐఏతో దాడులు చేయించడం, రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం, కక్షసాధింపు చర్యలకు పాల్పడటం తదితర అంశాలపై రైతు నేతలు అసంతృప్తి వ్యక్తంచేశారు. రైతుల పట్ల తమకు సానుభూతి ఉందని కేంద్రమంత్రుల బృందం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఇరువురి మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో 19న మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు.

చర్చలు నిర్ణయాత్మకంగా జరగలేదు: తోమర్‌

ఈ రోజు రైతులతో చర్చలు నిర్ణయాత్మకంగా జరగలేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. 19న మరోసారి చర్చలు జరపనున్నట్టు చెప్పారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చలి వాతావరణంలో రైతులు నిరసనలు తెలపడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పిలిచినప్పుడు తమ వైపు నుంచి హాజరవుతామని తెలిపారు. 

సుప్రీం కమిటీ వద్దకు వెళ్లం: టికాయిత్‌

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ వద్దకు తాము వెళ్లబోమని బీకేయూ నేత రాకేశ్‌ టికాయిత్‌ తెలిపారు. చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము కేంద్రంతోనే చర్చలు జరుపుతామన్నారు. 

ఇదీ చదవండి

సుప్రీం కమిటీ నుంచి తప్పుకొంటున్నా..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని