Savarkar Row: కర్ణాటక అసెంబ్లీలో ‘సావర్కర్‌’ ఫొటో వివాదం..

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న కర్ణాటకలో మరోసారి ‘సావర్కర్‌’ వివాదం రాజుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో హిందుత్వ సిద్ధాంతకర్త ఫొటోను ఆవిష్కరించడం దుమారం రేపుతోంది.

Published : 19 Dec 2022 14:03 IST

బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో మరోసారి ‘సావర్కర్‌ (Savarkar)’ వివాదం తెరపైకి వచ్చింది. రాష్ట్ర అసెంబ్లీలో హిందుత్వ సిద్ధాంతకర్త వీర్‌ సావర్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయడమే అందుక్కారణం. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్ష కాంగ్రెస్‌.. శాసనసభ వెలుపల ఆందోళన చేపట్టింది. అసలేం జరిగిందంటే..

కర్ణాటక అసెంబ్లీ (Assembly) శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల ప్రారంభానికి ముందు శాసనసభలో జాతిపిత మహాత్మాగాంధీ, సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌, బసవన్న, స్వామి వివేకానంద, సుభాష్‌ చంద్రబోస్‌, డా. బి.ఆర్‌ అంబేడ్కర్‌, వీర్‌ సావర్కర్‌ చిత్ర పటాలను రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, స్పీకర్‌ తదితరులు ఆవిష్కరించారు. అయితే, అసెంబ్లీలో సావర్కర్‌ ఫొటో పెట్టడం తాజాగా వివాదానికి దారితీసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆందోళనకు దిగింది.

వివాదాస్పద నేతల(సావర్కర్‌ను ఉద్దేశిస్తూ) ఫొటోలను అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత సిద్ధరామయ్య (Siddaramaiah).. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం చేస్తోన్న అవినీతిని  మేం లెవనెత్తుతామని వాళ్లకు(బొమ్మై సర్కారు) తెలుసు. అందుకే సావర్కర్‌ ఫొటోను పెట్టి అవినీతి అంశాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రపటాల గురించి ప్రతిపక్షాలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు’’ అని సిద్ధరామయ్య మండిపడ్డారు.

కాగా.. కర్ణాటకలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఇటీవల పలుమార్లు సావర్కర్‌ (Savarkar Row) అంశం తెరపైకి వచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో స్వాత్రంత్యం దినోత్సవం సందర్భంగా సావర్కర్‌ vs టిప్పు సుల్తాన్‌ పోస్టర్‌ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. అది భాజపా, కాంగ్రెస్‌ నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి కారణమైంది. మరోవైపు, వీర్‌ సావర్కర్‌ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బొమ్మై సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతుండటం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు