Jharkhand: ఆ IAS అధికారిణి సన్నిహితుల నుంచి రూ.19 కోట్ల నగదు సీజ్‌!

ఝార్ఖండ్‌లో ఐఏఎస్‌ అధికారిణి పూజా సింఘాల్‌ సన్నిహితుల ఇళ్లపై ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ...

Published : 07 May 2022 01:38 IST

రాంచీ: ఝార్ఖండ్‌లో ఐఏఎస్‌ అధికారిణి పూజా సింఘాల్‌ సన్నిహితుల ఇళ్లపై ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఉపాధిహామీ పథకం నిధుల దుర్వినియోగం, అవినీతికి సంబంధించిన కేసులో ఇద్దరి ఇళ్లలో సోదాలు చేసిన అధికారులు.. మొత్తం రూ.19.31 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పూజా సింఘాల్‌ ఛార్డర్డ్‌ అకౌంటెట్‌ సుమన్‌ కుమార్‌ వద్ద రూ.17 కోట్లు, మరో చోట రూ.1.8 కోట్లు మేర స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మరోవైపు ఐఏఎస్‌ అధికారిణి ఇంట్లో కూడా సోదాలు చేసిన అధికారులు.. నేరారోపణలకు సంబంధించిన కొన్ని పత్రాలు సీజ్‌ చేసినట్టు తెలిపారు. ఉపాధి హామీ పథకం నిధుల్లో రూ.18 కోట్ల అవినీతి, దుర్వినియోగానికి సంబంధించిన కేసులో జార్ఖండ్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో సోదాలు చేశారు. వీరి వద్ద స్వాధీనం చేసుకున్న డబ్బును లెక్కపెట్టేందుకు మూడు కౌంటింగ్‌ యంత్రాలను ఉపయోగించినట్టు సమాచారం. సీజ్‌ చేసిన మొత్తంలో రూ.2000, రూ.500, రూ.200, రూ.100 కట్టలే ఉన్నట్టు గుర్తించారు. 

2007-08కి సంబంధించిన ఈ కేసులో గతంలో జార్ఖండ్‌లోని కుంటిలో సెక్షన్‌ అధికారి‌, జూనియర్‌ ఇంజీనిర్‌  రామ్‌ బినోద్‌ ప్రసాద్‌ సిన్హా అరెస్టయ్యారు. జార్ఖండ్‌ విజిలెన్స్ బ్యూరో అతడిపై 16 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా.. ఈ కేసులో ఐఏఎస్‌ పూజా సింఘాల్‌ పేరు బయటకు రావడంతో శుక్రవారం ఈడీ రంగంలోకి దిగింది. జార్ఖండ్‌, బిహార్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌, ముంబయిలలో సోదాలు చేశారు. పూజా సింఘాల్‌ ప్రస్తుతం జార్ఖండ్‌ ప్రభుత్వంలోని మైనింగ్‌, భూగర్భశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని