NEET: పేపర్‌ లీక్‌కు రూ.30 లక్షలు: ‘నీట్‌’ దర్యాప్తులో సంచలనాలు..!

NEET paper Leak: నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ చేసినందుకు కొంతమంది అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున చెల్లించినట్లు తెలిసింది. బిహార్‌లో చేపట్టిన దర్యాప్తు వల్ల ఈ సంచలన విషయాలు బయటపడినట్లు సమాచారం.

Published : 15 Jun 2024 17:31 IST

పట్నా: దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్‌- యూజీ ప్రవేశ పరీక్ష 2024 (NEET UG-2024)’లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బిహార్‌లో ఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు సమాచారం రాగా.. కేంద్రం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది. అయితే, తాజాగా బిహార్‌ ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్‌ పేపర్‌ లీక్‌ (NEET Paper) చేసినందుకు కొందరు అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున చెల్లించినట్లు బయటపడిందట. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బిహార్‌ (Bihar) ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసింది. ఇందులోభాగంగానే ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో బిహార్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్‌ ఇంజినీర్‌ కూడా ఉన్నాడు. పేపర్‌ లీక్‌ గ్యాంగ్‌తో కలిసి తాను అక్రమాలకు పాల్పడినట్లు ఆ జూనియర్‌ ఇంజినీర్‌ విచారణలో అంగీకరించినట్లు సమాచారం. కొందరు నీట్ అభ్యర్థుల కుటుంబసభ్యులతోనూ తాను టచ్‌లో ఉన్నట్లు చెప్పాడట.

నీట్‌ను.. ‘ఛీట్‌’గా మార్చేశారు

‘‘మే 4వ తేదీన ఆ గ్యాంగ్‌లోని మాకు నీట్‌ (NEET) ప్రశ్నపత్రం లభించింది. ఈ పేపర్‌ కోసం కొంతమంది అభ్యర్థుల నుంచి మేం రూ.30లక్షల నుంచి రూ.32 లక్షల చొప్పున తీసుకున్నాం. ఆ తర్వాత వారిని సేఫ్‌హౌస్‌కు తీసుకెళ్లి ప్రశ్నపత్రం చూపించాం’’ అని మరో ఇద్దరు నిందితులు విచారణలో అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. మొత్తం 13 మంది నీట్‌ అభ్యర్థులు ఈ పేపర్‌ లీక్‌లో భాగస్వాములైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో నలుగురిని ఇప్పటికే అరెస్టు చేయగా.. మరో 9 మందికి తాజాగా నోటీసులు జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కాగా.. ఈ తాజా ఆరోపణలపై జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ ఇంకా స్పందించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని