Published : 26 Mar 2021 10:25 IST

ట్వీట్లు.. ఫీట్లు.. అమ్మితే కోట్లు!

డిజిటల్‌ ప్రపంచాన్ని ఊపేస్తున్న నయా ట్రెండ్‌ 

ఒక ట్వీట్‌ను వేలం వేయడమేంటి! దాన్ని కొనడానికి పోటీపడటమేంటి!.. ట్విటర్‌ సీఈవో జాక్‌ డొర్సే తొలి ట్వీట్‌ వేలంలో రూ.21 కోట్లకు అమ్ముడుపోయిందని తెలిసినప్పుడు అందరిలోనూ అదే ఆశ్చర్యం. అసలు ఒక ట్వీట్‌ను ఎందుకు కొంటారు? కొంటే ఏం వస్తుందన్న సందేహాలూ కలిగాయి. అది అర్థమవ్వాలంటే డిజిటల్‌ ప్రపంచాన్ని ఊపేస్తున్న నాన్‌ ఫంగిబుల్‌ టోకెన్స్‌ (ఎన్‌ఎఫ్‌టీ) గురించి తెలుసుకోవాల్సిందే. వీటి ద్వారా ట్వీట్లు, క్రీడాకారుల ఫీట్లు, అభిమాన గాయకుడి పాటలు, ప్రముఖ చిత్రకారుడి కళాఖండం ఇలా దేన్నైనా ఎంచక్కా కొనుక్కోవచ్చు. వాటికి యజమానులైపోవచ్చు. అయితే ఓ షరతు.. అది డిజిటల్‌ ప్రపంచంలో మాత్రమే. కొన్ని నెలల్లోనే మిలియన్ల డాలర్ల వ్యాపారంగా ఎదిగి ఎలాన్‌ మస్క్‌ లాంటి ప్రముఖులను సైతం ఆకర్షిస్తోంది ఎన్‌ఎఫ్‌టీ సామ్రాజ్యం.
ఏమిటీ ఎన్‌ఎఫ్‌టీ? 
నాన్‌ ఫంగిబుల్‌ టోకెన్స్‌(ఎన్‌ఎఫ్‌టీ) అంటే ఒక్క మాటలో డిజిటల్‌ ఆస్తులు అని చెప్పొచ్చు. డిజిటల్‌ మాధ్యమంలో సృష్టించిన ట్వీట్, చిత్రం, వీడియో లాంటి సృజనను సదరు రూపకర్త అమ్మకానికి ఉంచొచ్చు. దాని డిజిటల్‌ వెర్షన్‌ను కొన్నవారికి అందుకు సంబంధించిన యాజమాన్య హక్కులను బదలాయిస్తారు. ఆ డిజిటల్‌ ఫైల్‌కు బ్లాక్‌ చెయిన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఓ విశిష్ఠ సంఖ్యను కేటాయిస్తారు. అంటే ఆ డిజిటల్‌ వెర్షన్‌ ప్రపంచంలో ఒక్కటే ఉంటుంది. దానికి ఒక్కరే యజమాని ఉంటారు. దీంతోపాటు యాజమాన్య వివరాలను బ్లాక్‌ చెయిన్‌ ఆధారిత పబ్లిక్‌ లెడ్జర్‌లో నమోదు చేస్తారు. దీనిద్వారా ఆ డిజిటల్‌ వెర్షన్‌కు యజమాని ఎవరన్నది ప్రపంచంలో ఎక్కడ నుంచైనా ఎవరైనా చూడొచ్చు. హ్యాకింగ్‌కు వీలుకాని బ్లాక్‌ చైన్‌ సాంకేతికత వల్ల యాజమాన్య వివరాలను ఇతరులెవరూ మార్చడానికి సాధ్యం కాదు. భవిష్యత్తులో ఆ డిజిటల్‌ ఫైల్‌ను ఇంకెవరికైనా అమ్ముకోవచ్చు. అలా జరిగే లావాదేవీల వివరాలనూ డిజిటల్‌ లెడ్జర్‌లో నమోదు చేస్తారు. 

మిలియన్ల డాలర్ల మార్కెట్‌
ఎన్‌ఎఫ్‌టీల ట్రెండ్‌ 2017లో మొదలైనప్పటికీ 2020 చివరి నుంచి ఊహించని రీతిలో పుంజుకుంది. ఆ ఏడాదే ఎన్‌ఎఫ్‌టీ మార్కెట్‌ విలువ దాదాపు మూడింతలు పెరిగిందని, ప్రస్తుతం అది దాదాపు 250 మిలియన్ల డాలర్లకు చేరిందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇది మరింత వేగంగా విస్తరిస్తుందని అంటున్నారు.-ఈనాడు, ప్రత్యేక విభాగం

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని