అనుచిత వ్యాఖ్యలు చేసి.. యూటర్న్‌ తీసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్ల నుంచి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు వెలువడ్డాయి. అవి వివాదాస్పదం కావడంతో తాజాగా వివరణ వచ్చింది. 

Updated : 15 Jun 2024 15:18 IST

దిల్లీ: సార్వత్రిక ఫలితాలను ఉద్దేశించి భాజపా(BJP)పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త ఇంద్రేశ్‌ కుమార్ (Indresh Kumar) వివరణ ఇచ్చారు. ‘‘దేశ ప్రజల ఆలోచన ఏంటో స్పష్టంగా ఉంది. రాముడిని వ్యతిరేకించిన వారు అధికారాన్ని కోల్పోయారు. ఆయన్ను గౌరవించిన వారు అధికారం దక్కించుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైంది’’ అని ఆయన స్పష్టత ఇచ్చుకున్నారు.

‘‘నిజమైన సేవకుడు అహంకారం కలిగి ఉండడు. ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా పని చేస్తాడు’’ అంటూ ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన భాగవత్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ స్పందన రావడం చర్చనీయాంశమైంది. ఆ క్రమంలోనే ఇంద్రేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘భక్తి చూపి, తర్వాత అహంకారం పెంచుకున్న పార్టీ 240 దగ్గర ఆగిపోయింది. రాముడిని వ్యతిరేకించినవారు 234 వద్ద ఆగిపోయారు’’ అంటూ అధికార, విపక్ష కూటములపై విమర్శలు చేశారు. ఇవి వివాదాస్పదం కావడంతో తాజా స్పందన వచ్చింది.

ఈ పరిణామాల మధ్య ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు స్పందించాయి. తమకు భాజపాతో ఎటువంటి విభేదాల్లేవని వెల్లడించాయి. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల తరవాత ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ చేసిన ప్రసంగానికి తాజాగా ఆయన మాట్లాడిన మాటలకు పెద్దగా తేడా ఏమీ లేదని పేర్కొన్నాయి. భాగవత్‌ తాజా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడంతో గందరగోళం నెలకొందని తెలిపాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని