RTE Act: దేశవ్యాప్తంగా ‘ఉమ్మడి సిలబస్‌’పై సుప్రీం కోర్టులో పిల్‌..!

విద్యాహక్కు చట్టం 2019లో పలు సెక్షన్లు ఏకపక్షంగా, అసంబద్ధంగా ఉన్నాయని.. అందుకే దేశవ్యాప్తంగా ఉమ్మడి సిలబస్‌, పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఓ పిల్‌ దాఖలైంది.

Published : 11 Feb 2022 18:06 IST

విచారణను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం

దిల్లీ: విద్యాహక్కు చట్టం 2019లో పలు సెక్షన్లు ఏకపక్షంగా, అసంబద్ధంగా ఉన్నాయని.. అందుకే దేశవ్యాప్తంగా ఉమ్మడి సిలబస్‌, పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఓ పిల్‌ దాఖలైంది. దీనిని పరిశీలించిన జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్‌ గవైలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ విచారణను తిరస్కరించింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం.. ఈ విషయంలో హైకోర్టును సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.

‘రాజ్యాంగాన్ని వివరించడంలో ఆర్‌టీఈ చట్టంలోని 1(4), 1(5)సెక్షన్లు పెద్ద అవరోధంగా మారడంతోపాటు మాతృభాషలో ఉమ్మడి సిలబస్‌ లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. ఉమ్మడి విద్యా వ్యవస్థను తీసుకురావడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కానీ ఆ విషయంలో విఫలమైన ప్రభుత్వం.. కేవలం గతంలోని నేషనల్‌ కర్రిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌-2005లో కొన్ని మార్పులు చేసి కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది’ అని పిటిషినర్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో భిన్నమైన సిలబస్‌ కారణంగా విద్యార్థులందరికీ ప్రస్తుత వ్యవస్థ సమాన అవకాశాలు కల్పించలేదని అన్నారు. వీటితోపాటు మరికొన్ని కారణాలను పేర్కొన్న పిటిషినర్‌.. దేశవ్యాప్తంగా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉమ్మడి సిలబస్‌ ఉండేలా కేంద్రాన్ని ఆదేశించాలని విన్నవించారు.

పిటిషనర్‌ తరపు న్యాయవాది అభ్యర్థనను విన్న సుప్రీం ధర్మాసనం.. ‘ఈ విషయంలో మీరు హైకోర్టుకు ఎందుకు వెళ్లకూడదు. చట్టానికి సవరణలు చేసిన 12ఏళ్ల తర్వాత ఇక్కడకు వచ్చారు’ అంటూ సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ను ప్రశ్నించింది. ఈ అంశంపై ప్రస్తుతం తాము ఎలాంటి అభిప్రాయం చెప్పడం లేదని స్పష్టం చేసిన న్యాయస్థానం.. హైకోర్టును సంప్రదించవచ్చని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని