Facebook: రష్యాలో ఫేస్‌బుక్‌కు జరిమానా

ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్‌, మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌.. రష్యాలో వరుస జరిమానాలకు గురవుతున్నాయి. నిషేధిత కంటెంట్‌ను తొలగించడంతో విఫలమైనందుకు గానూ

Updated : 11 Jun 2021 16:21 IST

మాస్కో: ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్‌, మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌.. రష్యాలో వరుస జరిమానాలకు గురవుతున్నాయి. నిషేధిత కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైనందుకు గానూ ఈ రెండు సంస్థలకు రష్యా ప్రభుత్వం జరిమానా విధించింది. ఫేస్‌బుక్‌ 17 మిలియన్‌ రబెల్స్‌(2.36లక్షల డాలర్లు), టెలిగ్రామ్‌ 10 మిలియన్‌ రబెల్స్‌(1.39లక్షల డాలర్లు) చెల్లించాలని మాస్కో కోర్టు ఆదేశించింది. సామాజిక మాధ్యమాలపై నియంత్రణ పెంచడంలో భాగంగానే ఈ జరిమానాలు విధించినట్లు తెలుస్తోంది.

కాగా.. ఇటీవలి కాలంలో రష్యా ప్రభుత్వం ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్‌పై జరిమానా విధించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తమ మాధ్యమం నుంచి తొలగించనందుకుగానూ మే 25న ఫేస్‌బుక్‌కు 26 మిలియన్స్‌ రబెల్స్‌(3.62లక్షల డాలర్లు) జరిమానా పడింది. అంతకు నెలక్రితం ఇదే విషయంలో టెలిగ్రామ్‌ 5 మిలియన్‌ రబెల్స్‌(69వేల డాలర్లు) చెల్లించాలని రష్యా ప్రభుత్వం ఆదేశించింది.

ఈ ఏడాది ఆరంభంలో రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీ అరెస్టు తర్వాత అక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వేలాది మంది ఆందోళనకారులు వీధుల్లో చేరి నిరసనలు చేపట్టారు. అయితే దీనికి సోషల్‌మీడియా సంస్థలే కారణమంటూ అధికారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై నియంత్రణ పెంచాలని భావించిన రష్యా ప్రభుత్వం.. ఇటీవల ట్విటర్‌పై నిషేధం విధిస్తామని హెచ్చరించింది. అంతేగాక, చట్టవిరుద్ధంగా ఉన్న కంటెంట్‌ను మాధ్యమాల నుంచి తొలగించాలని ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని