Russia: రష్యాలో ఆగని కొవిడ్‌ ఉద్ధృతి.. ఒక్కరోజులో అత్యధిక మరణాలు నమోదు

రష్యాలో కొవిడ్ విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. భారీ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి మొదలైన తర్వాత మొదటిసారిగా ఇక్కడ 24 గంటల వ్యవధిలో 1015 మంది మృతి చెందడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొత్తగా 33,740 కేసులు...

Published : 19 Oct 2021 22:06 IST

మాస్కో: రష్యాలో కొవిడ్ విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది! భారీ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి మొదలైన తర్వాత మొదటిసారిగా ఇక్కడ 24 గంటల వ్యవధిలో 1015 మంది మృతి చెందడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొత్తగా 33,740 కేసులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. దేశ రాజధాని మాస్కోలో 5700 మందికి పాజిటివ్‌గా తేలింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 80.60 లక్షల కేసులు నమోదు కాగా..  2,22,325 మరణాలు సంభవించాయి. కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్‌, భారత్‌, మెక్సికో తర్వాత రష్యా ఐదో స్థానంలో కొనసాగుతోంది.

వ్యాక్సినేషన్‌ వేగవంతానికి చర్యలు..

రష్యన్ అధికారులు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పౌరులకు లాటరీలు, బోనస్‌లు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు రష్యా జనాభాలో 32 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ పూర్తయింది. మరోవైపు కొవిడ్‌ ఆంక్షల విషయంలో దేశంలోని ఆయా ప్రాంతాలు స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని ఇదివరకే ఆదేశాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని రెండో అతిపెద్ద నగరం సెయింట్ పీటర్స్‌బర్గ్ పౌరులకు ‘డిజిటల్‌ కోడ్‌’ను ప్రవేశపెట్టనున్నట్లు సోమవారం ప్రకటించింది. నవంబర్ నుంచి థియేటర్లకు వెళ్లేందుకు, సమావేశాలు, క్రీడలు ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ కోడ్‌ను తప్పనిసరి చేసింది. వైరస్‌ నుంచి కోలుకున్నవారికి, వ్యాక్సినేషన్‌ పూర్తయినవారికి ఈ కోడ్‌ ఇవ్వనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని