Covid deaths: రష్యాలో కరోనా డేంజర్‌ బెల్స్‌.. ఎన్నడూలేనంతగా కొత్త కేసులు, మరణాలు!

కరోనా వైరస్‌ విజృంభణతో రష్యా గజగజ వణుకుతోంది. రోజురోజుకీ అక్కడ కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మంగళవారం 973 మంది కొవిడ్‌తో మరణించగా.........

Updated : 14 Oct 2021 20:44 IST

మాస్కో: కరోనా వైరస్‌ విజృంభణతో రష్యా గజగజ వణుకుతోంది. రోజురోజుకీ అక్కడ కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా 31వేలకు పైగా కేసులు రాగా.. 986 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా మంగళవారం 973 మంది కొవిడ్‌తో మరణించగా.. బుధవారం 984మంది, తాజాగా మృతుల సంఖ్య మరింతగా పెరగడం అక్కడి కొవిడ్‌ ఉగ్రరూపానికి అద్దంపడుతోంది. గతంలో ఎన్నడూలేనంతగా వైరస్‌ విజృంభణ కొనసాగుతుండటంతో దేశ ఆరోగ్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా జరుగుతుండటానికి తోడు కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడంతో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తూ వేలాది మంది ప్రాణాల్ని బలితీసుకుంటోంది. 

రష్యా ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్‌ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడిచిన 24గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 31,299 కొత్త కేసులు రాగా.. 986మంది మృతిచెందారు. గత కొన్ని వారాలుగా అక్కడ కొవిడ్‌ పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది. మొత్తంగా ఇప్పటివరకు 7.9 మిలియన్ల కేసులు నమోదు కాగా.. 2,20,315 మరణాలు సంభవించాయి. కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్న దేశాల జాబితాలో తొలిస్థానాల్లో అమెరికా, బ్రెజిల్‌, భారత్‌, మెక్సికో ఉండగా.. రష్యా ఐదోస్థానంలో కొనసాగుతోంది. రోజురోజుకీ రష్యాలో కరోనా పరిస్థితి ఉద్ధృతమవుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా మరోసారి కఠిన లాక్‌డౌన్‌ విధించేందుకు రష్యా ప్రభుత్వం విముఖత వ్యక్తంచేయడం గమనార్హం. కరోనా వైరస్‌ ప్రబలిన తొలినాళ్లలో విధించిన లాక్‌డౌన్‌తోనే దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో పాటు పుతిన్‌ రేటింగ్స్‌ కూడా పడిపోయాయి. దీంతో కరోనా నిబంధనలు అమలుచేసే బాధ్యతలను స్థానిక అధికార యంత్రాంగాలకు అప్పగించారు. లాక్‌డౌన్‌ విధించే అవకాశంపై పుతిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ను అక్కడి విలేకర్లు ప్రశ్నించగా.. దేశంలోని ఆయా ప్రాంతాలు అక్కడి పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. కొవిడ్‌ రోగుల రద్దీ ఆస్పత్రులకు పెరుగుతున్నప్పటికీ చికిత్సకు అవసరమైన వనరులు, అనుభవం దేశ ఆరోగ్య వ్యవస్థకు ఉందన్నారు. 

మరోవైపు, కొవిడ్‌ పరిస్థితి ఆందోళనకంగా మారడంతో ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్‌ మొరాస్కో హెచ్చరించారు. సామాజిక కార్యకలాపాలను నియంత్రించకపోతే ఇన్ఫెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా 11లక్షల మందికి పైగా కరోనా రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. తద్వారా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర భారం పడుతోందన్నారు. కరోనా ముప్పు అధికంగా ఉన్న 65 ఏళ్లు పైబడిన వారిలో 42శాతానికి టీకా పంపిణీ జరిగిందని తెలిపారు. రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ జన సమహాల కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. థియేటర్లు, రెస్టారెంట్లతో పాటు ఇతర ప్రాంతాలకు టీకా తీసుకున్న వారితో పాటు ఇటీవల కొవిడ్‌ బారినపడి కోలుకున్నవారు లేదా కొవిడ్ నెగెటివ్‌ నివేదిక చూపించిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. మాస్కో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ సహా పలు నగరాల్లో జనజీవనం సాధారణంగానే కొనసాగుతోంది. అక్కడ వ్యాపారాలు యథాతథంగా నడుస్తున్నాయి. మాస్క్‌ ధరించాలన్న నిబంధనను కూడా గాలికొదిలేస్తుండటంతో వైరస్‌ మరింతగా విజృంభణకు కారణమవుతోంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని