Covid Deaths: రష్యాలో కరోనా మరణమృదంగం.. రికార్డు స్థాయిలో మరణాలు!

కరోనా మహమ్మారి రష్యాను మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత కొంత కాలంగా అక్కడ కొత్త కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం......

Updated : 13 Oct 2021 08:45 IST

మాస్కో: కరోనా మహమ్మారి రష్యాను మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత కొంత కాలంగా అక్కడ నమోదవుతున్న మరణాలు గత రికార్డులను తిరగరాస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 973మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పట్నుంచి ఒక్కరోజులో ఇంత భారీగా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి.  గడిచిన 24గంటల్లో రష్యాలో 28,190 కొత్త కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తంగా 7.8 మిలియన్లకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 2,18,345మంది కొవిడ్‌తో మృతిచెందినట్టు వివరించారు. యూరప్‌లో అత్యధిక కొవిడ్‌ మరణాలు రష్యాలోనే సంభవించడం గమనార్హం. వ్యాక్సినేషన్‌ రేటు మందగించడం వల్లే గత నెల నుంచి ప్రారంభమైన కొవిడ్‌ కేసులు, మరణాలు ప్రస్తుతం తీవ్రరూపం దాల్చాయన్న విమర్శలూ ప్రభుత్వంపై వస్తున్నాయి. 

మందకొడిగా టీకా పంపిణీ!

సెప్టెంబర్‌ నెల నుంచి రష్యాలో కొవిడ్‌ కేసులు, మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ఇందుకు వ్యాక్సిన్‌ పంపిణీ మందకొడిగా సాగడమే కారణమని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో తొలి వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసుకున్నట్లు ప్రకటించిన రష్యా.. పంపిణీలో మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడిపోయింది. దాదాపు 14.6కోట్ల జనాభా కలిగిన రష్యాలో ఇప్పటివరకు కేవలం 33శాతం మందికి మాత్రమే టీకా తొలి డోసు అందగా.. 29శాతం మందికి పైగా రెండు డోసులూ తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

ఉదాసీనతే విజృంభణకు కారణం!

కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించేందుకు క్రెమ్లిన్‌ నిరాకరిస్తోంది. కొవిడ్‌ కట్టడి చర్యలను మరింత కఠినతరం చేయడంపై నిర్ణయాధికారాలను ప్రాంతీయ అధికారులకే అప్పగించింది. రష్యాలోని పలు ప్రాంతాల్లో భారీ జన సమూహ కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. థియేటర్లు, రెస్టారెంట్లతో పాటు ఇతర ప్రాంతాలకు టీకా తీసుకున్న వారితో పాటు ఇటీవల కొవిడ్‌ బారినపడి కోలుకున్నవారు లేదా కొవిడ్ నెగెటివ్‌ నివేదిక చూపించిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. మరోవైపు, మాస్కో, సెయింట్‌పీటర్స్‌బర్గ్‌ సహా పలు నగరాల్లో జనజీవనం సాధారణంగానే కొనసాగుతోంది. వ్యాపారాలు యథాతథంగా నడుస్తున్నాయి. మాస్క్‌ ధరించాలన్న నిబంధనలు అంతకఠినంగా అమలు కాకపోవడం అక్కడి ప్రజలు/ప్రభుత్వాల ఉదాసీన వైఖరినికి నిదర్శనంగా చెప్పొచ్చు. వైరస్‌ని కట్టడిచేసే చర్యల్లో భాగంగా మాస్కో నగరంలో అధికారులు షాపింగ్‌ మాల్స్‌లో ఉచితంగా కొవిడ్‌ పరీక్షలను విస్తరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని