Afghan Crisis: తాలిబన్లను గుర్తించాలో, వద్దో ఇంకా డిసైడ్‌ కాలేదు!

అఫ్గాన్‌ పౌరుల భద్రత, రష్యా దౌత్యవేత్తలకు రక్షణ కల్పించే అంశంలో తాలిబన్లు తీసుకోబోయే భవిష్యత్తు చర్యలను గమనిస్తున్నాం..

Published : 26 Aug 2021 23:50 IST

రష్యా అధ్యక్షుడి అధికార ప్రతినిధి వెల్లడి

మాస్కో/ప్యారిస్‌: అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లను తమ ప్రభుత్వం ఇంకా గుర్తించలేదని రష్యా స్పష్టంచేసింది. వారి పాలనను గుర్తించాలా, వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకొనే ముందు వారి ఆక్రమణలో ఉన్న అఫ్గానిస్థాన్‌లో పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ వెల్లడించారు. అఫ్గాన్‌ పౌరుల భద్రత, రష్యా దౌత్యవేత్తలకు రక్షణ కల్పించే అంశంలో తాలిబన్లు తీసుకోబోయే భవిష్యత్తు చర్యలను గమనిస్తున్నామన్నారు. అఫ్గానిస్థాన్‌లో శాంతి, సుస్థిరత చూడాలని కోరుకుంటున్నామని, ఆ దేశం నుంచి వస్తోన్న డ్రగ్స్‌ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కృషి  చేస్తామన్నారు. 

శుక్రవారం రాత్రి తర్వాత ఆపరేషన్‌ నిలిపేస్తున్నాం.. ఫ్రెంచ్‌ ప్రధాని 

మరోవైపు, శుక్రవారం రాత్రి తర్వాత కాబుల్‌ విమానాశ్రయం నుంచి ప్రజల తరలింపును నిలిపివేస్తున్నట్టు ఫ్రాన్స్‌ ప్రధాని జీన్‌ కాస్టెక్స్‌ వెల్లడించారు. అమెరికా సహా పలు పశ్చిమదేశాలు ఈ నెల 31 వరకు తరలింపు పూర్తి చేయాలన్న డెడ్‌లైన్‌ను ఎదుర్కొంటున్న వేళ ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఆగస్టు 31 నాటికి అమెరికా ఉపసంహరణ కారణంగా శుక్రవారం రాత్రి నుంచి తాము ప్రజల తరలింపును చేపట్టలేమని కాస్టెక్స్‌ పేర్కొన్నారు. గత నెలలో కాబుల్‌లో ఆపరేషన్‌ ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 2వేల మందికి పైగా అఫ్గాన్లు, వంద మంది ఫ్రెంచ్‌ ప్రజల్ని తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని