Covid Deaths: రష్యాలో ఆగని మృత్యుఘోష.. కరోనా మరణాల్లో సరికొత్త రికార్డు!

కరోనా మహమ్మారి రష్యాలో మృత్యునాదం చేస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ వస్తున్న కొవిడ్‌ కేసులు, మరణాలు సరికొత్త రికార్డులను నమోదుచేస్తున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో......

Published : 13 Oct 2021 18:25 IST

మాస్కో: కరోనా మహమ్మారి రష్యాలో మృత్యునాదం చేస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ వస్తున్న కొవిడ్‌ కేసులు, మరణాలు సరికొత్త రికార్డులను నమోదుచేస్తున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 984మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. 28,717 మంది ఇన్ఫెక్షన్‌ బారినపడినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్‌ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో మరణాలు సంభవించడం ఇదే ప్రథమం. నిన్న 973 మరణాలు నమోదు కాగా.. తాజాగా ఆ సంఖ్య మరింతగా పెరగడం అక్కడి దారుణ పరిస్థితికి అద్దంపడుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగడం,  కఠిన ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వ యంత్రాంగం విముఖత ప్రదర్శించడంతో వైరస్‌ మళ్లీ తిరగబెడుతూ వేలాది మంది ప్రాణాలు బలిగొంటోందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి

మరోవైపు, భారీగా పెరుగుతున్న ఇన్ఫెక్షన్లు రష్యా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. అక్కడ ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. కొవిడ్‌ సోకిన వారిలో 2,19,329మంది రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి మైఖేల్‌ మురాస్కో నిన్న జరిగిన కేబినెట్‌ సమావేశంలో తెలిపారు. యూరప్‌ ఖండంలో రష్యాలోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు అధికారిక గణాంకాల  ప్రకారం.. 7.8మిలియన్ల పాజిటివ్‌ కేసులు, 2,19,329 మరణాలు నమోదయ్యాయి.

అందుకే మందకొడిగా వ్యాక్సినేషన్‌

దేశంలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు, మరణాలకు వ్యాక్సినేషన్‌ రేటు మందగించడమే కారణమని క్రెమ్లిన్‌ పేర్కొంది. 29శాతం మంది ప్రజలు పూర్తిగా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్టు రష్యా ప్రధానమంత్రి మైఖేల్‌ మిషుస్తిన్‌ చెప్పారు. వ్యాక్సినేషన్‌ రేటును మరింత పుంజుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఒత్తిడిని పెంచడం ద్వారా టీకా పొందేలా ప్రజల్ని బలవంతం చేయొద్దని  హెచ్చరిస్తుండటం గమనార్హం. దీనికితోడు, అక్కడ వ్యాక్సిన్లపై జరుగుతున్న దుష్ప్రచారం.. ప్రజల్లో సందేహాలు వ్యక్తంకావడం కూడా వ్యాక్సినేషన్‌ రేటు మందగించడానికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. 

భారీగా చనిపోతున్నా లాక్‌డౌన్‌పై విముఖత!

దేశంలో మరోసారి ఇంత భారీ సంఖ్యలో కొవిడ్‌ కేసులు, మరణాలు నమోదవుతున్నా కఠిన లాక్‌డౌన్ విధించేందుకు క్రెమ్లిన్‌ విముఖత ప్రదర్శిస్తోంది. గతంలో విధించిన లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో పాటు పుతిన్‌ రేటింగ్‌ తగ్గిపోయింది. దీంతో కొవిడ్‌ ఆంక్షలు అమలుచేసే అధికారాన్ని ప్రాంతీయ అధికార యంత్రాంగానికే అప్పగించారు. రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ జన సమహాల కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. థియేటర్లు, రెస్టారెంట్లతో పాటు ఇతర ప్రాంతాలకు టీకా తీసుకున్న వారితో పాటు ఇటీవల కొవిడ్‌ బారినపడి కోలుకున్నవారు లేదా కొవిడ్ నెగెటివ్‌ నివేదిక చూపించిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. మాస్కో, సెయింట్‌పీటర్స్‌బర్గ్‌ సహా పలు నగరాల్లో జనజీవనం సాధారణంగానే కొనసాగుతోంది. అక్కడ వ్యాపారాలు యథాతథంగా నడుస్తున్నాయి. మాస్క్‌ ధరించాలన్న నిబంధనలు అంత కఠినంగా అమలు కాకపోవడంతో వైరస్‌ స్వైరవిహారం చేస్తోంది. వైరస్‌ని కట్టడిచేసే చర్యల్లో భాగంగా మాస్కో నగరంలో అధికారులు షాపింగ్‌ మాల్స్‌లో ఉచితంగా కొవిడ్‌ పరీక్షలను విస్తరించడం సహా పలు చర్యలు చేపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని