Ukraine Crisis: భారత విద్యార్థి మృతిపై దర్యాప్తు జరుపుతాం : రష్యా

రష్యా సైనిక చర్యలో భాగంగా ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి చెందడంపై దర్యాప్తు చేపడతామని రష్యా ప్రభుత్వం వెల్లడించింది.

Published : 03 Mar 2022 01:56 IST

భారతీయులను తరలించేందుకు ‘ప్రత్యేక కారిడార్‌’ కోసం ప్రయత్నం

దిల్లీ: రష్యా సైనిక చర్యలో భాగంగా ఉక్రెయిన్‌లో భారత విద్యార్థి మృతి చెందడంపై దర్యాప్తు చేపడతామని రష్యా ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్న రష్యా..  విద్యార్థి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ నగరాల్లో చిక్కుకున్న వందల మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నామని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఖార్కివ్‌, సమీ వంటి నగరాలతోపాటు ఉక్రెయిన్‌లో ఘర్షణ వాతావరణం అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి భారతీయులను రష్యాకు తరలించేందుకు ఉన్న మార్గాల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని వెల్లడించింది.

‘ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై భారత్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఇందుకోసం ఉన్న ప్రత్యేక మార్గాల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాం. ఖార్కివ్‌, సమీ నగరాలతోపాటు ఘర్షణ వాతావరణం అధికంగా ఉన్న ఇతర ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా సరిహద్దు ప్రాంతాల నుంచి రష్యా భూభాగంలోకి భారతీయులను తరలించేందుకు ‘మానవతా కారిడార్‌’ రూపొందించే మార్గాలను అన్వేషిస్తున్నాం’ అని భారత్‌లోని రష్యా రాయబారి డేనిస్‌ అలిపోవ్‌ పేర్కొన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను అత్యవసరంగా తరలించే విషయంపై భారత్‌ నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఈ మానవతా కారిడార్‌ ఏర్పాటుపై రష్యా అధికారులు చురుకుగా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

విద్యార్థి మరణంపై రష్యా విచారణ..

ఉక్రెయిన్‌ నగరంలో రష్యా జరిపిన దాడుల్లో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు రష్యా రాయబారి అలిపోవ్‌ పేర్కొన్నారు. ఈ ఘటనపై రష్యా తప్పకుండా దర్యాప్తు చేపడుతుందని డేనిస్‌ అలిపోవ్‌ స్పష్టం చేశారు. ఇక ఉక్రెయిన్‌ విషయంలో భారత్‌ స్వతంత్రంగా, సమతుల్యంగా వ్యవహరించడం పట్ల భారత్‌కు రష్యా మరోసారి ధన్యవాదాలు తెలుపుతోందన్నారు. భారత్‌తో రష్యా వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న విషయాన్ని గుర్తుచేసిన ఆయన.. రానున్న రోజుల్లోనూ ఇదే పరంపర కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలను భారత్‌కు అందించడంపై మాట్లాడిన ఆయన.. ఇతర దేశాలు రష్యాకు ఆంక్షలు విధించినప్పటికీ భారత్‌కు అవి చేరవేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండవన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని