Russia: రష్యాలో ఆగని కొవిడ్‌ ఉద్ధృతి.. ఒక్కరోజులో వెయ్యి దాటిన మరణాలు

రష్యాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి చెందడం మొదలైన తర్వాత మొదటిసారిగా ఇక్కడ గడచిన 24 గంటల వ్యవధిలో వెయ్యికి పైగా మరణాలు నమోదు కావడం...

Published : 16 Oct 2021 17:34 IST

మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి చెందడం మొదలైన తర్వాత మొదటిసారిగా ఇక్కడ గడిచిన 24 గంటల వ్యవధిలో వెయ్యికి పైగా మరణాలు నమోదు కావడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రికార్డు స్థాయిలో 33,208 కొత్త కేసులు రాగా, 1002 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. కేసులు, మృతుల సంఖ్య పెరుగుతుండటం ఇది వరుసగా మూడో రోజు. మొత్తంగా ఇప్పటివరకూ దాదాపు 80 లక్షల కేసులు నమోదు కాగా..  2,22,315 మరణాలు సంభవించాయి. కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్న దేశాల జాబితాలో తొలిస్థానాల్లో అమెరికా, బ్రెజిల్‌, భారత్‌, మెక్సికో ఉండగా.. రష్యా ఐదో స్థానంలో కొనసాగుతోంది. 

31 శాతం మందికే వ్యాక్సినేషన్‌ పూర్తి..

స్థానికంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం, కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడంతో రష్యాలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు కేవలం 31 శాతం జనాభాకు మాత్రమే పూర్తి వ్యాక్సినేషన్‌ పూర్తయింది. మరోవైపు దేశవ్యాప్తంగా మరోసారి కఠిన లాక్‌డౌన్‌ విధించేందుకు రష్యా ప్రభుత్వం ఇటీవల విముఖత వ్యక్తం చేయడం గమనార్హం. లాక్‌డౌన్‌ విధించే అవకాశంపై పుతిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ను అక్కడి విలేకర్లు ప్రశ్నించగా.. దేశంలోని ఆయా ప్రాంతాలు అక్కడి పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. కొవిడ్‌ రోగుల రద్దీ ఆస్పత్రులకు పెరుగుతున్నప్పటికీ చికిత్సకు అవసరమైన వనరులు, అనుభవం దేశ ఆరోగ్య వ్యవస్థకు ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని