JEE-Mains: ఇతనో 420.. సాయం చేసింది 820 మందికి..

రష్యన్ హ్యాకర్‌ అండదండలతో గత ఏడాది నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ ప్రవేశ పరీక్షలో 820 మంది అనుచిత మార్గంలో హాజరయ్యారని ప్రాథమికంగా తెలిసింది.

Updated : 04 Oct 2022 18:08 IST

దిల్లీ: దేశ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షలో పలువురు అభ్యర్థులు రష్యన్ హ్యాకర్ సహకారంతో పరీక్ష రాశారు. ఇతగాడి అండదండలతో గత ఏడాది నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలో 820 మంది అనుచిత మార్గంలో హాజరయ్యారని ప్రాథమికంగా తెలిసింది. ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దిల్లీ కోర్టుకు వెల్లడించింది. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ హ్యాకర్‌ మిఖాయిల్ షార్గిన్‌కు కోర్టు  రెండు రోజుల కస్టడీ విధించింది. 

గత ఏడాది సెప్టెంబర్‌లో ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన జేఈఈ మెయిన్స్‌కు 9 లక్షల మంది హాజరయ్యారు. ఆ పరీక్షను నిర్దేశిత కేంద్రాల్లో నిర్వహించారు. కానీ మిఖాయిల్ పరీక్షా కేంద్రంలోని కంప్యూటర్లను హ్యాక్‌ చేయడం ద్వారా విద్యార్థుల అసోసియేట్స్‌ వాటిని వాడటానికి వీలు కలిగింది. దాంతో ఆ అసోసియేట్స్ వేరే ప్రాంతంలో ఉండి ప్రశ్నలను పరిష్కరించేలా అవకాశం ఏర్పడిందని సీబీఐ దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటివరకు 24 మంది అరెస్టయ్యారు. 

ఈ రష్యన్ హ్యాకర్‌ను నిన్న దిల్లీలో అరెస్టు చేశారు. అతడు విచారణకు సహకరించడం లేదని దర్యాప్తు సంస్థ కోర్టుకు వెల్లడించింది. ‘అతడు ప్రొఫెషనల్ హ్యాకర్‌. అతడు iLeon సాఫ్ట్‌వేర్‌లోకి చొచ్చుకొచ్చాడు’ అని తెలిపింది. సీబీఐ తన ఎలక్ట్రానిక్ పరికరాలను తెరవాలని కోరుకుంటే అది తన సమక్షంలోనే జరగాలని మిఖాయిల్ కోర్టును కోరాడు. మరోపక్క అతడు తన యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ కోరింది. 

హరియాణాలోని సోనేపట్‌కు చెందిన పరీక్షా కేంద్రంలో జరిగిన పరీక్షలో హ్యాకింగ్‌ జరిగినట్లు విచారణను బట్టి తెలుస్తోంది. ప్రాథమికంగా 20 మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. వారు మూడేళ్ల పాటు ఈ ప్రవేశ పరీక్షకు హాజరుకాకుండా నిషేధం విధించారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థ పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అలాగే ఇందులో అనేకమంది విదేశీయుల పాత్ర ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని