
Sputnik Light: సింగిల్ డోసు వ్యాక్సిన్ సమర్థవంతమైనదే..!
మాస్కో: రష్యా అభివృద్ధి చేసిన సింగిల్ డోసు వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-లైట్’ ప్రాణాంతక కరోనా వైరస్- డెల్టా వేరియంట్ నుంచి 70 శాతం రక్షణ కల్పిస్తుందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (RDIF) వెల్లడించింది. టీకా తీసుకున్న వారిలో మొదటి మూడు నెలలు మెరుగైన రక్షణను ఇస్తున్నట్లు తెలిపింది. గమేలెయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ చేసిన అధ్యయనంలో డెల్టా వేరియంట్‌ను ఈ వ్యాక్సిన్ సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు రుజువైందని పేర్కొంది.
‘‘ఇతర వ్యాక్సిన్ల మాదిరిగానే స్పుత్నిక్ లైట్ డెల్టా వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తుంది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌ను స్పుత్నిక్ లైట్ 83 శాతం అడ్డుకుంటుంది. అలాగే ఆసుపత్రిలో చేరే ముప్పును 94 శాతం తగ్గిస్తుంది’’ అని ఆర్‌డీఐఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే గమేలెయ సెంటర్ పనిచేస్తోంది. అయితే, ఇందులో చేసిన పరిశోధనల్లో స్పుత్నిక్ లైట్ మెరుగైన ఫలితాలను ఇస్తుందని తేలింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న 60 ఏళ్ల వయసు గలవారిపై 75 శాతం రక్షణ ఇస్తూ ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. రెండు డోసుల స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లోని 4 బిలియన్ల జనాభాకు అందించింది. సింగిల్ డోసు వ్యాక్సిన్‌ను ఇప్పటికే 15 దేశాలకు పైగా సరఫరా చేస్తుండగా.. ఇంకా 30 దేశాలు తమకు సరఫరా చేయాలని ముందుస్తుగా పేర్లు నమోదు చేసుకున్నాయి.