Shiv Sena: గాడ్సేను కీర్తిస్తూ.. నూలు నేసేందుకు సబర్మతీకే వెళ్తారేంటో..!

‘ఒకవైపు నాథూరాం గాడ్సేను కీర్తిస్తుంటారు.. మరోవైపు విదేశీ ప్రముఖుల్ని సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్తుంటారు’ అంటూ శివసేన పార్టీ భాజపాపై విమర్శలు గుప్పించింది.

Published : 23 Apr 2022 12:29 IST

భాజపాపై విమర్శలు గుప్పించిన శివసేన

ముంబయి: ‘ఒకవైపు నాథూరాం గాడ్సేను కీర్తిస్తుంటారు.. మరోవైపు విదేశీ ప్రముఖుల్ని సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్తుంటారు’ అంటూ శివసేన పార్టీ భాజపాపై విమర్శలు గుప్పించింది. ఇప్పటికీ భారత్‌ అంటే గుర్తొచ్చేది మహాత్మా గాంధీనే అంటూ తన పార్టీ పత్రికలో సామ్నాలో వ్యాఖ్యానించింది. 

‘వారు నాథూరం గాడ్సే సిద్ధాంతాలకు మద్దతు ఇస్తారు. విదేశాల నుంచి ఎవరైనా ప్రముఖులు వస్తే మాత్రం.. నూలు నేసేందుకు సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్తారు. ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. గుజరాత్‌లో ఉక్కుమనిషి సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించారు. కానీ, బ్రిటన్‌ పీఎం బోరిస్ జాన్సన్, ఇతర అతిథుల్ని అక్కడకు తీసుకెళ్లలేదు. ఎందుకంటే ప్రపంచ వేదికపై గాంధీ భారత దేశానికి ప్రతీకగా మిగిలిపోయారు’ అంటూ శివసేన భాజపా వైఖరిని విమర్శించింది. 

అలాగే దేశంలో పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘర్షణలను ప్రస్తావించి, ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘జాన్సన్ భారతదేశంలో ఉన్న సమయంలో రాజధాని దిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో మత విద్వేషం, హింసాత్మక వాతావరణం నెలకొని ఉండేది. ఇంత సుదీర్ఘ కాలం తర్వాత కూడా బ్రిటన్‌ ప్రధాని భారత్‌లో అదే వాతావరణాన్ని చూస్తున్నారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

గురు, శుక్రవారాల్లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన మొదట గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి, చరఖా తిప్పారు. ఆ తర్వాత దిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో తనకు లభించిన స్వాగతానికి జాన్సన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేకమైన స్నేహితుడంటూ మోదీతో ఆత్మీయంగా మెలిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని