Rajasthan: ‘గహ్లోత్‌జీ వారి మొర ఆలకించండి’.. ప్రైవేట్‌ వైద్యులకు సచిన్ పైలట్‌ మద్దతు!

రాజస్థాన్‌ (Rajasthan) ప్రభుత్వం తీసుకొచ్చిన రైట్‌ టు హెల్త్‌ (Right To Health) బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న ప్రైవేటు వైద్యులను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) కలవడం రాష్ట్రంలో చర్చినీయాంశమైంది. 

Published : 31 Mar 2023 01:29 IST

జైపూర్‌: రాజస్థాన్‌ (Rajasthan) ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆరోగ్య బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా వీరికి మద్దతుగా పలుచోట్ల ప్రభుత్వ వైద్యులు సైతం ఆందోళనలు చేపట్టారు. దీంతో వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న వైద్యులకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) మద్దతు ప్రకటించారు. ఆరోగ్య బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వైద్యులతో సీఎం అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) చర్చలు జరపాలని కోరారు. ‘‘అశోక్ గహ్లోత్‌ ప్రభుత్వం ఆందోళన చేస్తున్న వైద్యులతో చర్చలు జరపాలి. ఈ ఆందోళనల కారణంగా రాష్ట్రంలో ఎంతో మంది రోగులు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. రోగుల కోసమైనా ప్రభుత్వం ఆందోళన చేస్తున్న వైద్యుల వాదనను వినాలి’’అని సచిన్‌ పైలట్‌ కోరారు. 

ఈ ఆందోళనలపై రాజస్థాన్‌ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యులు చేపట్టిన ఆందోళనలో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని చెప్పింది. ప్రభుత్వ వైద్యులు వెంటనే విధుల్లోకి రావాలని, లేదంటే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ‘రైట్‌ టు హెల్త్‌’ (Right To Health) బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రైవేటు వైద్యులు ప్రకటించారు. ఈ బిల్లుతో రాష్ట్రంలోని ఏ పౌరుడైనా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఏ ఆస్పత్రిలోనైనా అత్యవసర చికిత్స పొందవచ్చు. ఈ చట్టం పేరుతో రాజస్థాన్‌ ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సీఎం అశోక్‌ గహ్లోత్‌తో ముందు నుంచి విభేదిస్తున్న సచిన్‌ పైలట్‌ ఆందోళన చేస్తున్న వైద్యులను కలవడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని