Wrestlers Protest: రెజ్లర్ల ఫొటోలు మార్ఫింగ్.. మండిపడ్డ సాక్షి మలిక్
Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన సాగిస్తున్న రెజ్లర్లను ఇకపై జంతర్‌మంతర్ వద్ద దీక్షకు అనుమతించలేమని దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు.. రెజ్లర్లను పోలీసులు బలవంతంగా బస్సులో ఎక్కించిన ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేయడం దుమారం రేపింది.
దిల్లీ: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం రోజునే.. అగ్రశ్రేణి రెజ్లర్ల ఆందోళనను పోలీసులు అడ్డుకున్న తీరు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఆందోళన సాగిస్తున్న రెజ్లర్లు.. ఆదివారం కొత్త పార్లమెంట్ వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనలో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వారి ఆందోళన కొనసాగితే దేశ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. (Wrestlers Protest)
12 మందిపై కేసు..
అల్లర్లకు పాల్పడటం, ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకోవడం వంటి ఆరోపణలపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షి మలిక్ (Sakshi Malik), వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat), బజ్‌రంగ్ పునియా (Bajrang Punia) సహా 12 మందిపై ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీన్ని రెజ్లర్లు తీవ్రంగా ఖండించారు. ‘‘బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మేం ఫిర్యాదు చేస్తే ఆయనపై కేసు నమోదు చేసేందుకు దిల్లీ పోలీసులకు 7 రోజులు పట్టింది. కానీ శాంతియుతంగా నిరసన చేస్తున్న మాపై ఏడు గంటల్లోనే కేసు పెట్టారు’’ అని వినేశ్ ఫొగాట్ ఆవేదన వ్యక్తం చేశారు.
మార్ఫింగ్ ఫొటోలు వైరల్..
ఇదిలా ఉండగా.. రెజ్లర్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని బస్సుల్లో ఎక్కించి వేర్వేరు చోట్లకు తరలించారు. అయితే ఆ ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేయడంతో అవి సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ మార్ఫింగ్ ఫొటోల్లో వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్ (Sangeeta Phogat) పోలీసు వ్యాన్‌లో కూర్చుని నవ్వుతూ సెల్ఫీ తీసుకున్నట్లుగా ఉంది. దీనిపై సాక్షి మలిక్ స్పందిస్తూ.. ‘‘అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావట్లేదు. మాకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
జంతర్ మంతర్ వద్ద అనుమతి లేదు..
రెజ్లర్ల ఆందోళన (Wrestlers Protest)పై దిల్లీ డిప్యూటీ కమిషనర్ తాజాగా స్పందించారు. ‘‘గత 38 రోజులుగా జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద ఆందోళన చేసిన రెజ్లర్లకు మేం అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. కానీ, నిన్న వారు చట్టాన్ని అతిక్రమించారు. మేం చెప్పినా వారు వినిపించుకోలేదు. అందుకే అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. రెజ్లర్లు తమ దీక్షను కొనసాగించాలనుకుంటే అందుకు అనుమతి కోరుతూ అప్లికేషన్ ఇవ్వొచ్చు. అయితే జంతర్‌మంతర్ వద్ద మాత్రం దీక్షకు అనుమతినివ్వలేదు. అది కాకుండా మరో చోట వారికి అనుమతి కల్పిస్తాం’’ అని తెలిపారు. నిన్నటి ఘటన తర్వాత జంతర్‌మంతర్‌ను పోలీసులు ఖాళీ చేయించారు. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ విధించారు. ఆందోళనకారులు, ఇతరులను లోపలికి అనుమతించట్లేదు.
రాజదండం.. ఒరిగిపోయింది: స్టాలిన్
రెజ్లర్లను అరెస్టు చేయడాన్ని పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన దురదృష్టకరమని తమిళనాడు సీఎం స్టాలిన్ (MK Stalin) మండిపడ్డారు. ‘‘రెజ్లర్లపై పోలీసులు ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రతిపక్షాలు బహిష్కరించినా.. రాష్ట్రపతిని ఆహ్వానించకపోయినా పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని జరిపించారు. అదే రోజున రెజర్లపై ఇలాంటి దాడులు జరగడం మరింత విచారకరం. ఈ ఘటనతో పార్లమెంట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రతిష్ఠించిన రాజదండం (సెంగోల్) మొదటి రోజే ఒరిగిపోయినట్లుగా అన్పిస్తోంది’’ అని స్టాలిన్ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!
-
Revanth Reddy: కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్‌రెడ్డి
-
Suryakumar Yadav: ఇన్నాళ్లూ తికమక పడ్డా.. నా కొత్త పాత్రను ఇష్టపడుతున్నా: సూర్యకుమార్
-
2 Year Old Girl: రాత్రి సమయంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి.. చివరకు..!
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!