Aero India Show: ఏరో ఇండియా షో.. నాన్‌వెజ్‌ అమ్మకాలపై నిషేధం.. ఎందుకో?

బెంగళూరు(Bengaluru)లో ఏరో ఇండియా షో (Aero India Show)జరుగుతున్న నేపథ్యంలో అక్కడి అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఎయిర్‌ షో జరుగుతున్న ప్రాంతానికి 10 కి.మీ పరిధిలో మాంసాహార అమ్మకాలపై తాత్కాలికంగా నిషేధం విధించారు.

Published : 28 Jan 2023 01:22 IST

బెంగళూరు: ఏరో ఇండియా షో నిర్వహించనున్న నేపథ్యంలో బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌ షో జరుగుతున్న ప్రదేశానికి 10 కిలోమీటర్ల పరిధిలో పూర్తిగా నాన్‌వెజ్‌ అమ్మకాలపై నిషేధం విధించింది. అసలు ఎయిర్‌ షోకి నాన్‌ వెజ్‌ అమ్మకాలపై నిషేధానికి సంబంధమేంటి? బీబీఎంపీ ఎందుకీ నిర్ణయం తీసుకుంది?

బెంగళూరులోని ఎలహంక ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఏరో ఇండియా షో నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి వందలాది మంది ప్రదర్శనకారులు దీనిలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌ షోకు ఎలాంటి ఆటంకం కలగకుండా బీబీఎంపీ కీలక చర్యలు చేపట్టింది. ఎయిర్‌ షో జరుగుతున్న ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20 మధ్య ఎలాంటి మాంసాహారం విక్రయాలు జరపకూడదని ఆదేశించింది. చేపలు, చికెన్‌, మటన్‌ తదితర దుకాణాలన్నింటినీ మూసి వేయాలని కోరింది. దీనికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరింది. ఆదేశాలను అతిక్రమిస్తే బీబీఎంపీ చట్టం 2020, ఇండియన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ నిబంధనలు 1937 ప్రకారం చర్యలు తీసుకుంటామని బీబీఎంపీ హెచ్చరించింది.

సాధారణంగా మాంసాహారం విక్రయించే ప్రదేశాల్లో గద్దలు, డేగలు లాంటి పక్షులు ఎక్కువగా తిరుగుతుంటాయి. పొరపాటున ఎయిర్‌ షో జరిగే ప్రాంతంలోకి ఇవి ఎగిరొస్తే.. భారీ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో బీబీఎంపీ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఎయిర్‌ షో కోసం ఇప్పటి వరకు 731 మంది ప్రదర్శనకారులు రిజిస్టర్‌ చేసుకున్నట్లు ఏరో ఇండియా వెబ్‌సైట్‌ పేర్కొంది. ఇందులో 633 మంది భారతీయులు కాగా, 98 మంది విదేశీయులు ఉన్నారు. బెంగళూరులో 1996 నుంచి ఎయిర్‌ షో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 13 ఎయిర్‌షోలు నిర్వహించిన ఏరో ఇండియా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని