Salman Rushdie: ప్రముఖ రచయిత సల్మాన్‌ రష్దీపై దాడి.. స్టేజిపైనే కత్తిపోట్లు!

భారత సంతతికి చెందిన  ప్రముఖ బ్రిటిష్‌ నవలా రచయిత, బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీపై (Salman Rushdie) దాడి జరిగింది.......

Updated : 12 Aug 2022 22:24 IST

హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలింపు

న్యూయార్క్‌‌: భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటిష్‌ నవలా రచయిత, బుకర్‌ ప్రైజ్‌ విజేత సల్మాన్‌ రష్దీపై (Salman Rushdie) దాడి జరిగింది. ఓ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రసంగానికి సిద్ధమవుతుండగా.. ఆయన వైపు దూసుకొచ్చిన దుండగుడు స్టేజిపైనే కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. అమెరికా న్యూయార్క్‌లోని చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో సమావేశానికి సల్మాన్‌ రష్దీ (75) హాజరయ్యారు. ఆయన ప్రసంగానికి సిద్ధమవుతున్న క్రమంలోనే స్టేజిపైకి దూసుకొచ్చిన ఓ దుండగుడు కత్తితో మెడపై దాడికి పాల్పడినట్లు అక్కడి న్యూస్‌ ఏజెన్సీలు వెల్లడించాయి. కత్తి పోట్లకు గురైన రష్దీ అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అంశం మాత్రం తెలియలేదని న్యూయార్క్‌ పోలీసులు వెల్లడించారు. దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 

1947లో ముంబయిలో జన్మించిన సల్మాన్‌ రష్దీ.. కొన్నాళ్ల తర్వాత బ్రిటన్‌కు తరలివెళ్లారు. రష్దీ రచించిన మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌ (Midnight Children) నవలకు 1981లో ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌ దక్కడంతో ఆయన ఫేమస్‌ అయ్యారు. అయితే ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదయ్యాయి. ముఖ్యంగా 1980లో రచించిన ‘ది సాతానిక్‌ వెర్సెస్‌‌’ (The Satanic Verses) నవల వివాదాలకు కేంద్రబిందువై.. ఆయనకు హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. మతాన్ని కించపరుస్తోందని పేర్కొంటూ 1988 నుంచి ఇరాన్‌లో ఈ నవలను నిషేధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని