EVM: అప్పుడు టెస్లా కార్లనూ హ్యాక్ చేయొచ్చేమో: మస్క్‌కు రాజీవ్‌ చంద్రశేఖర్‌ కౌంటర్‌

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను గెలిచిన రెండు స్థానాలకు రాజీనామా చేస్తారా..? అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ప్రశ్నించారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Updated : 17 Jun 2024 13:45 IST

దిల్లీ: పోలింగ్‌ సమయంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు హ్యాకింగ్‌కు గురవుతున్నాయంటూ టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌(Elon Musk) చేసిన ఆరోపణలపై దుమారం రేగుతోంది. తాజాగా దీనిపై కేంద్రమాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్ స్పందించారు. అప్పుడైతే టెస్లా కార్లను హ్యాక్‌ చేసే వీలుంటుంది కదా మస్క్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘‘క్యాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ టోస్టర్‌నే తీసుకోండి. వాటిని మనం హ్యాక్‌ చేయలేం. ఈవీఎంలు కూడా అలాంటివే. అవి ఓట్లను లెక్కిస్తాయి. ఆ ఫలితాన్ని భద్రపరుస్తాయి’’ అని వివరించారు. అలాగే తాను మస్క్‌ను కాకపోయినప్పటికీ, సాంకేతికతపై తనకు కాస్త పరిజ్ఞానం ఉందన్నారు. ‘‘ఈ ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఎలక్ట్రానిక్‌, డిజిటల్ పరికరమేదీ ఉండదు. టెస్లా కారునూ హ్యాక్‌ చేయొచ్చని ఎవరైనా చెప్పొచ్చు’’ అని వ్యాఖ్యానించారు.

తారుమారుకు అవకాశం: పిట్రోడా 

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా స్పందించారు. ఈవీఎం వ్యవస్థలో తారుమారుకు అవకాశం ఉందన్నారు. ‘‘ఎలక్ట్రానిక్స్, టెలికాం, ఐటీ, సాఫ్ట్‌వేర్ వంటి రంగాల్లో 60 ఏళ్లపాటు పనిచేశాను.  నేను ఈవీఎం వ్యవస్థను నేను క్షణ్ణంగా అధ్యయనం చేశాను. దానిలో తారుమారుకు అవకాశం ఉందని భావిస్తున్నాను. పోలైన ఓట్లను లెక్కించడానికి బ్యాలెట్ పేపర్ల విధానం మెరుగైంది’’ అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

రాహుల్ రాజీనామా చేస్తారా..?

‘‘భారత్‌లోని ఈవీఎంలు ‘బ్లాక్‌ బాక్స్‌’లాంటివి. వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి ఉండదు. దీంతో దేశ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి’’ అంటూ మస్క్‌ వ్యాఖ్యలను ఉద్దేశించి రాహుల్‌ స్పందించిన సంగతి తెలిసిందే. దీనిపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే ఆయనకు ఒక సూటి ప్రశ్న వేశారు. మరి ఇప్పుడు రాహుల్ రాజీనామా చేస్తారా..? అని అడిగారు. ‘‘రాహుల్‌ గాంధీ రెండుచోట్ల నుంచి విజయం సాధించారు. అక్కడ ఈ ఈవీఎంలనే ఉంచారు. అన్నిచోట్ల ఈవీఎంలు సరిగా పనిచేయలేదని చెప్పి, రాజీనామా చేయాలి. ఇది జరుగుతుందా..?’’ అని శిందే ప్రశ్నించారు. కేరళలోని వయనాడ్‌తో పాటు యూపీలోని రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీచేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈవీఎంలపై మస్క్‌ చీకట్లు

అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఆందోళన వ్యక్తంచేసిన మస్క్‌.. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడం ద్వారా హ్యాకింగ్‌ను నివారించొచ్చని సూచించారు. భారత ఈవీఎంలకు బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్‌లతో కనెక్టివిటీ ఉండదని, వీటిని రీప్రోగ్రామ్ చేయడం కూడా కుదరదని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ బదులిచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని