Mulayam Singh Yadav: అశ్రునయనాల మధ్య ములాయంకు తుది వీడ్కోలు

కుటుంబ సభ్యులు,అభిమానులు అశ్రునయనాలతో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌కు తుది వీడ్కోలు పలికారు.

Updated : 11 Oct 2022 17:18 IST

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు,అభిమానులు అశ్రునయనాలతో నేతాజీకి తుది వీడ్కోలు పలికారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ములాయం స్వగ్రామం సైఫయిలో అధికార లాంఛనాలతో ఈ ప్రక్రియ ముగిసింది. ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నంత సేపు.. నేతాజీ అమర్‌ రహే నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. 

హాజరైన ప్రముఖులు..

ఈ దిగ్గజ నేతకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు తుది వీడ్కోలు పలికారు. సైఫయిలోని నుమాయిష్ గ్రౌండ్‌లో ఉంచిన ఆయన పార్థివదేహానికి వారు నివాళులు సమర్పించారు. కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు భూపేశ్‌ బఘేల్‌, కమల్‌ నాథ్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్, ఆమె కుమారుడు అభిషేక్ బచ్చన్‌ తదితరులు వచ్చారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాగా.. ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంజలి ఘటించారు.  

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం..  పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన గౌరవార్థం యూపీ ప్రభుత్వం మూడురోజుల సంతాప దినాలు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని