Drugs case: అదేం లేదు.. పనిమీదే దిల్లీ వచ్చా: సమీర్‌ వాంఖడే

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసు వ వ్యవహారం కీలక మలుపుతు తిరుగుతోంది. ఈ కేసులో షారుక్‌ నుంచి డబ్బు డిమాండ్‌ చేశారన్న అంశంపై......

Updated : 26 Oct 2021 10:33 IST

దిల్లీ: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసు వ్యవహారం కీలక మలుపుతు తిరుగుతోంది. ఈ కేసులో షారుక్‌ నుంచి డబ్బు డిమాండ్‌ చేశారన్న అంశంపై ఆరోపణల నేపథ్యంలో ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే సోమవారం సాయంత్రం దిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద విలేకర్లు ఆయన్ను చుట్టుముట్టి ఏదైనా దర్యాప్తు సంస్థ సమన్లు ఇచ్చిందా? అని అడిగిన ప్రశ్నల్ని ఆయన కొట్టిపారేశారు. దిల్లీలో తనకు పని ఉండటం వల్లే వచ్చానని స్పష్టంచేశారు. తన దర్యాప్తుపై 100 శాతం కట్టుబడి ఉన్నట్టు వాంఖడే చెప్పారు.

షారుక్‌ నుంచి ఎన్‌సీబీ రూ.25కోట్లు డబ్బు డిమాండ్‌ చేసినట్టు ప్రభాకర్‌ సాయిల్‌ అనే ప్రత్యక్ష సాక్షి సంచలన ఆరోపణలు కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో సమీర్‌ వాంఖడేపై విచారణ ప్రారంభమైనట్టు ఎన్‌సీబీ డిప్యూటీ డీజీ జ్హానేశ్వర్‌ సింగ్‌ తెలిపారు. ఆయనపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ఇప్పుడే విచారణ ప్రారంభించామని.. అయితే, ఆ పదవిలో సమీర్‌ వాంఖడే కొనసాగుతారో? లేదో చెప్పడం మాత్రం తొందరపాటే అవుతుందని జ్ఞానేశ్వర్‌ పేర్కొన్నారు.

ఈ నెల 2న రాత్రి ముంబయిలోని క్రూజ్‌ నౌకలో జరుగుతున్న డ్రగ్స్‌ పార్టీపై వాంఖడే నేతృత్వంలో ఎన్‌సీబీ దాడిచేసిన సంగతి తెలిసిందే. ఇందులో అరెస్టయిన ఆర్యన్‌ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఆ దాడి సమయంలో తాను కేపీ గోసావి అనే వ్యక్తితో కలిసి ఘటనాస్థలికి వెళ్లానని ఎన్‌సీబీ తరఫు 9మంది సాక్షుల జాబితాలో ఉన్న ప్రభాకర్‌ తెలిపారు. ఎన్‌సీబీ తరఫున మరో సాక్షిగా ఉన్న గోసావికి తాను వ్యక్తిగత అంగరక్షకుడిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆర్యన్‌ను ఎన్‌సీబీ కార్యాలయానికి తీసుకొచ్చాక శామ్‌ డిసౌజా అనే వ్యక్తితో గోసావి ఫోన్‌లో మాట్లాడాడని, రూ.25 కోట్లు డిమాండ్‌ చేయాలని అతడికి చెబుతుండగా విన్నట్టు పేర్కొన్నారు. చివరకు రూ.18 కోట్లకు ఖరారు చేయమని, అందులో రూ.8 కోట్లు వాంఖడేకు ఇవ్వాల్సి ఉందని డిసౌజాకు గోసావి చెప్పాడన్నారు. ఆ తర్వాత గోసావి, డిసౌజాలను షారుక్‌ మేనేజర్‌ పూజా దద్లానీ కలిశారని చెప్పారు. గోసావికి ఇద్దరు వ్యక్తులు రూ.50 లక్షలు ఇచ్చారని, అందులో రూ.38 లక్షలు తిరిగి ఇచ్చాడని.. ఈ వివరాలన్నింటినీ తాను కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. తనతో వాంఖడే, గోసావి 10 ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని వెల్లడించారు. ప్రస్తుతం గోసావి ఆచూకీ తెలియడం లేదని, అందుకే ప్రాణభయంతో తాను ఈ విషయాలను బహిర్గతం చేస్తున్నట్లు చెప్పారు. అయితే, ఈ ఆరోపణల్ని ఎన్‌సీబీ తోసిపుచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని