Sameer Wankhede: వాంఖడే విదేశీ పర్యటనలు, ఖరీదైన గడియారాలపై సీబీఐ కన్ను

డగ్స్‌ కేసులో ఆర్యన్‌ఖాన్ అరెస్టయిన దగ్గరి నుంచి ఆ కేసులో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్యన్‌ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన అధికారి సమీర్ వాంఖడే(Sameer Wankhede)..ఇప్పుడు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. 

Published : 15 May 2023 18:04 IST

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు రూ.25కోట్లు లంచం డిమాండ్‌ చేశారన్న అభియోగాలపై ఎన్‌సీబీ మాజీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే(former NCB officer Sameer Wankhede)తోపాటు మరో నలుగురిపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసింది. దానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ సోమవారం బయటకువచ్చింది. దానిలో దర్యాప్తు అధికారులు వాంఖడేపై మరిన్ని ఆరోపణలు పొందుపరిచారు. దాంతో ఆయన విదేశీ పర్యటనలు, ఖరీదైన చేతి గడియారాల గురించి సీబీఐ ఆరా తీస్తోంది. 

‘వాంఖడే తన విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను సరిగా వివరించలేదు. తన డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇవ్వకుండా ఓ సంస్థతో కలిసి చేతిగడియారాలు కొనుగోలు, అమ్మకాలు జరిపినట్లు వెల్లడైంది. వీటి గురించి ఆయన ఇచ్చిన ఖర్చు వివరాలు పొంతనలేకుండా ఉన్నాయి’అని ఎన్‌సీబీకి చెందిన స్పెషల్ ఎంక్వైరీ టీమ్(SET)గుర్తించింది. అది వెల్లడించి వివరాలు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నమోదయ్యాయి. ఆ ఎఫ్‌ఐఆర్‌లో వాంఖడేతో పాటు అప్పటి సీనియర్ అధికారులు,  సాక్షి కేపీ గోసావి, అతడి సన్నిహితుడు సానవిల్లే డిసౌజా పేర్లు ఉన్నాయి. 

ఆర్యన్‌ అరెస్టైన క్రూజ్‌ డ్రగ్స్‌ కేసులో సాక్షుల్లో గోసావి ఒకరు. అతడు అప్పట్లో ఎన్‌సీబీ అదుపులో ఉన్న ఆర్యన్‌తో సెల్ఫీ దిగడం వివాదాస్పదమైంది. ‘నిబంధనలకు విరుద్ధంగా గోసావి ఎన్‌సీబీ కార్యాలయానికి వచ్చేవాడు.  స్వేచ్ఛగా సెల్ఫీలు దిగాడు. అలాగే నిందితుల నుంచి వివరాలు రికార్డు చేసేవాడు’అని ఎఫ్ఐఆర్‌లో అధికారులు పేర్కొన్నారు. ‘అలాగే ఆర్యన్  మాదకద్రవ్యాలు కలిగి ఉన్నాడని బెదిరిస్తూ అతడి కుటుంబం నుంచి రూ.25 కోట్లు దోచుకునేందుకు కుట్ర చేశారు. ఆ మొత్తాన్ని రూ.18 కోట్లకు తగ్గించారు. అనంతరం టోకెన్‌ మొత్తం కింద రూ.50 లక్షలను గోసావి, డిసౌజా తీసుకున్నారు. ఆ తర్వాత దానిని తిరిగి ఇచ్చేశారు. అదుపులో ఉన్న వ్యక్తుల చుట్టూ గోసావి కనిపించడం వల్ల అతడు ఎన్‌సీబీ అధికారి అని భ్రమపడేలా ఉద్దేశపూర్వంగా వ్యవహరించినట్లు కనిపించింది’అని తెలిపారు.  

వాంఖడే ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 2021 అక్టోబరులో డ్రగ్స్‌ పార్టీకి సంబంధించిన కేసులోఆర్యన్‌ ఖాన్‌(Aryan Khan)ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అది అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఎన్‌సీబీ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆ తర్వాత వాంఖడేపై పలు ఆరోపణలు రావడంతో జోనల్‌ డైరెక్టర్ పదవి నుంచి బదిలీ చేసి, విచారణ చేపట్టారు. అయితే వాంఖడే భార్య ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా వస్తోన్న విమర్శలన్నీ అవాస్తవమని అందరికీ తెలుసన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు