Monkeypox: దేశంలో మంకీపాక్స్‌ కలకలం.. యూపీలో 5 ఏళ్ల చిన్నారి నమూనాల సేకరణ

కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోకముందే మరో వైరస్‌ ప్రపంచాన్ని వేధిస్తోంది. అమెరికా సహా అనేక దేశాల్లో మంకీపాక్స్‌ (Monkeypox) కేసులు నానాటికి పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది

Published : 04 Jun 2022 10:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోకముందే మరో వైరస్‌ ప్రపంచాన్ని వేధిస్తోంది. అమెరికా సహా అనేక దేశాల్లో మంకీపాక్స్‌ (Monkeypox) కేసులు నానాటికీ పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. మన దేశంలో ఈ వైరస్‌ కేసులు నమోదు కానప్పటికీ.. తాజాగా యూపీలో ఓ చిన్నారికి మంకీపాక్స్‌ తరహా లక్షణాలు కన్పించడం కలకలం రేపుతోంది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఐదేళ్ల చిన్నారికి శరీరంపై దద్దుర్లు, బొబ్బలు రావడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ చిన్నారి నమూనాలను మంకీపాక్స్‌ (Monkeypox) టెస్ట్‌ కోసం సేకరించినట్లు ఘాజియాబాద్‌ చీఫ్‌ మెడికల్ అధికారి వెల్లడించారు. ఇది కేవలం ముందు జాగ్రత్త చర్యే అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సదరు చిన్నారికి ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలూ లేవని చెప్పారు. ఆమె గానీ, వారి కుటుంబం గానీ గత నెల రోజులుగా ఎలాంటి విదేశీ పర్యటనలూ చేయలేదన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 700 కేసులు..

ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాలకు ఈ మంకీపాక్స్‌ (Monkeypox) వైరస్‌ వ్యాపించింది. ఇప్పటివరకు 700లకు పైగా కేసులు నమోదైనట్లు యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్‌ (సీడీసీ) డేటా వెల్లడించింది. అమెరికాలోనే 11 రాష్ట్రాల్లో 21 కేసులు బయటపడ్డాయి. కెనడాలో 77 కేసులు నమోదయ్యాయి.

ఏంటీ వైరస్‌..?

మంకీపాక్స్ (Monkeypox) ఒక వైరల్‌ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్‌ (Smallpox) కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్‌ అధికంగా వ్యాపిస్తుంటుంది. తుంపర్ల ద్వారా లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు వెల్లడించారు. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరుపెట్టారు. ఆ తర్వాత 1970ల్లో తొలిసారి మనుషుల్లో ఇది బయటపడింది. సాధారణంగా ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పితో పాటు దద్దుర్లు, బొబ్బలు వస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని