JNU: జేఎన్‌యూ చరిత్రలో తొలి మహిళా వైస్‌ ఛాన్సలర్‌..

దేశ రాజధాని దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) చరిత్రలో తొలిసారి ఓ మహిళా ప్రొఫెసర్‌ వైస్‌ ఛాన్సలర్‌ (వీసీ)గా నియమితులయ్యారు.

Published : 07 Feb 2022 21:37 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) చరిత్రలో తొలిసారి ఓ మహిళా ప్రొఫెసర్‌ వైస్‌ ఛాన్సలర్‌ (వీసీ)గా నియమితులయ్యారు. జేఎన్‌యూ తదుపరి వీసీగా శాంతిశ్రీ దుల్హిపుడి పండిత్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం ఆమె మహారాష్ట్రలోని సావిత్రిబాయ్‌ పూలే యూనివర్శిటీలో పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. శాంతిశ్రీ నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఆమోదం తెలిపారని కేంద్ర విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఐదేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని తెలిపారు. 

ప్రస్తుతం జేఎన్‌యూ వైస్‌ ఛాన్సలర్‌గా ఉన్న ఎం. జగదీశ్‌ కుమార్‌ను ఇటీవల యూజీసీ ఛైర్మన్‌గా కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. దీంతో జేఎన్‌యూ వీసీగా శాంతిశ్రీని నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రోజే ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జగదీశ్‌ కుమార్‌ ఆమెకు అభినందనలు తెలియజేశారు. జేఎన్‌యూ చరిత్రలో తొలి మహిళా వైస్‌ ఛాన్సలర్‌ ఆమే కావడం విశేషం.

59ఏళ్ల శాంతిశ్రీ పండిత్‌ 1988లో గోవా యూనివర్శిటీలో తన ఉపాధ్యాయ వృత్తిని ఆరంభించారు. ఆ తర్వాత 1993లో పుణె యూనివర్శిటీకి మారారు. పలు అకాడమీల్లో అడ్మినిస్ట్రేటివ్‌ బాధ్యతలు చేపట్టారు. యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసర్చ్ ‌(ఐసీఎస్‌ఎస్‌ఆర్‌) సభ్యురాలిగానూ వ్యవహరించారు. శాంతిశ్రీ.. జేఎన్‌యూ పూర్వ విద్యార్థి కూడా. ఈ విశ్వవిద్యాలయం నుంచే ఆమె అంతర్జాతీయ సంబంధాల్లో ఎంఫిల్‌, పీహెచ్‌డీ పూర్తి చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని