Hijab Row: కర్ణాటక హిజాబ్‌ వివాదం.. రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు!

కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో హిజాబ్‌ ధరించి వచ్చిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థినులను తరగతులకు అనుమతించకపోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలను అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని జిల్లా మంత్రి స్పష్టం చేశారు...

Published : 05 Feb 2022 13:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో హిజాబ్‌ ధరించి వచ్చిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థినులను తరగతులకు అనుమతించకపోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలను అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని జిల్లా మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ శనివారం ఈ వ్యవహారంపై స్పందించారు. హిజాబ్‌ అంశాన్ని విద్యార్థుల చదువులకు అడ్డుగా ఉంచడం ద్వారా.. దేశ పుత్రికల భవిష్యత్తును దోచుకుంటున్నామని ట్వీట్‌ చేశారు. నేటి వసంత పంచమి సరస్వతీ పూజ వేడుకను ప్రస్తావిస్తూ.. ‘సరస్వతీ దేవి అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ విషయంలో భేదభావం చూపదు’ అని రాసుకొచ్చారు.

కర్ణాటకలోని ఉడుపి, చిక్కమగళూరు జిల్లాల్లో ఈ తరహా వివాదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. నిబంధనల మేరకు హిజాబ్‌ ధరించి కళాశాలకు వస్తే అనుమతించే ప్రసక్తే లేదని నిర్వాహకులు చెబుతుండగా.. విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అరగ జ్ఞానేంద్ర ఇటీవల మాట్లాడుతూ.. మత సంప్రదాయాలు పాటించేందుకు విద్యాసంస్థలు వేదిక కారాదని హితవు పలికారు. మరోవైపు విద్యార్థినులను కళాశాలలోకి అనుమతించకపోవడాన్ని జమ్మూ-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఖండించారు. బాలికల విద్యకు ప్రాధాన్యమిస్తున్నామంటూ కేంద్రం డొల్లమాటలు చెబుతోందని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని