
దేశాన్ని వారి నుంచి కాపాడాలి: టికాయిత్
ఘజియాబాద్: దేశాన్ని కంపెనీల నుంచి కాపాడాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ రూపశిల్పి డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా దిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టికాయిత్ మాట్లాడుతూ.. ‘సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఫార్మర్’ అనే నినాదాన్ని ఇచ్చారు.
‘కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పట్టించుకోవడం లేదు. కేవలం కంపెనీల గురించే ఆలోచిస్తోంది. ప్రభుత్వం భాజపా చేతిలో కాకుండా.. కంపెనీల చేతిలో నడుస్తోంది. కాబట్టి దేశాన్ని ఈ కంపెనీల రాజ్యం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేరుతో పలు కంపెనీలు రైతుల భూములపై కన్ను వేశాయి. కేంద్రం దేశాన్ని ఆయా కంపెనీలకు అమ్ముతోంది’ అని టికాయిత్ ఆరోపించారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విభజించు, పాలించు విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అన్ని కులాలు, మతాలు సమానమే.. కాబట్టి నియంతలా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి దీటుగా బదులివ్వాలివ్వాలని పిలుపునిచ్చారు.
కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్ నుంచి దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై నిరసన చేస్తున్న రైతులతో కేంద్రం దఫాల వారీగా చర్చలు నిర్వహించినప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. దీంతో ప్రభుత్వం ఆ మూడు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రైతుల ఆందోళనలు కొనసాగుతాయని చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.