Third Wave: వచ్చే నెలలో థర్డ్‌ వేవ్‌ మొదలు..?

వచ్చే నెలలోనే (ఆగస్టు) థర్డ్‌ వేవ్‌ ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక హెచ్చరించింది.

Published : 05 Jul 2021 15:23 IST

ఎస్‌బీఐ నివేదిక అంచనా

దిల్లీ: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో వణికిపోయిన భారత్‌లో.. పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. అయినప్పటికీ మూడో ముప్పు తప్పదని ఇప్పటికే ఆరోగ్యరంగ నిపుణులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలోనే (ఆగస్టు) థర్డ్‌ వేవ్‌ ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక హెచ్చరించింది. సెప్టెంబర్‌ నెలలో ఇది గరిష్ఠానికి చేరుకోవచ్చని అంచనా వేసింది.

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి, బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం వంటి అంశాలపై భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ నిపుణుల బృందం ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా ‘కొవిడ్‌19: ది రేస్‌ టు ఫినిషింగ్‌ లైన్‌’ పేరుతో తాజాగా పరిశోధనాత్మక నివేదికను విడుదల చేసింది. దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువగానే ఉందని అభిప్రాయపడిన నివేదిక, మే 7వ తేదీన గరిష్ఠానికి చేరుకున్నట్లు తెలిపింది. ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే.. జులై రెండో వారానికి రోజువారీ కేసుల సంఖ్య 10వేలకు తగ్గుతుందని పేర్కొంది. అయినప్పటికీ ఆగస్టు రెండో పక్షం నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

ఎస్‌బీఐ నివేదికలో మరిన్ని అంశాలు..

* థర్డ్‌వేవ్‌లో కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌ గరిష్ఠ కేసులతో పోలిస్తే థర్డ్‌వేవ్‌ గరిష్ఠ స్థాయి కేసులు 1.7రెట్లు ఎక్కువగా ఉండవచ్చు.

* ఇప్పటివరకు నమోదవుతున్న గణాంకాల ప్రకారం, ఆగస్టు రెండో వారం తర్వాత కేసుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అనంతరం నెల రోజుల వ్యవధిలోనే గరిష్ఠానికి చేరుకుంటుంది.

* దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగానే కొనసాగుతోంది. నిత్యం సరాసరి 40లక్షల డోసులను పంపిణీ చేస్తున్నారు.

* ఇప్పటివరకు దేశ జనాభాలో 4.6శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయ్యింది. మరో 20.8శాతం మంది కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అయితే, ఇది అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ దేశాలతో పోలిస్తే కాస్త తక్కువేనని ఎస్‌బీఐ నివేదిక అభిప్రాయపడింది.

ఇదిలా ఉంటే.. దేశంలో రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 39వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 723 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్‌లో కరోనా మృతుల సంఖ్య 4లక్షల 2వేలు దాటింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు