DKS: డీకే శివకుమార్‌కు సుప్రీంలో ఊరట.. సీబీఐ పిటిషన్‌ విచారణ వాయిదా!

అక్రమాస్తులకు సంబంధించిన కేసులో డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ (CBI) దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను జులై 14కు సుప్రీం కోర్టు (Supreme Court) వాయిదా వేసింది.

Published : 17 May 2023 14:21 IST

దిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి బాధ్యతలు సిద్ధరామయ్య (Siddaramaiah), డీకే శివకుమార్‌ (DK Shivakumar)లలో ఎవరు చేపడుతారు..? అన్న విషయంపై సందిగ్ధత నెలకొన్న వేళ.. ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకేఎస్‌పై ఉన్న కేసు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. అక్రమాస్తులకు సంబంధించిన ఈ కేసులో డీకే శివకుమార్‌కు తాత్కాలిక ఊరట లభించింది. ఆయనపై చేపట్టిన దర్యాప్తుపై మధ్యంతర స్టే ఇస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ (CBI) దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను జులై 14కు సుప్రీం కోర్టు (Supreme Court) వాయిదా వేసింది.

డీకే శివకుమార్‌పై వచ్చిన అక్రమాస్తుల ఆరోపణలపై దర్యాప్తు చేయడంపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులోని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ధర్మాసనం పరిశీలించింది. డీకేఎస్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ.. మే 23న దీనికి సంబంధించిన కేసు హైకోర్టు ధర్మాసనం ముందుకు రానుందని చెప్పారు. దీంతో సీబీఐ వేసిన పిటిషన్‌ విచారణను జులైకి వాయిదా వేసింది.

మనీలాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటోన్న డీకే శివకుమార్‌పై దర్యాప్తును ఆధారంగా చేసుకొని.. ఆదాయపు పన్ను శాఖ  కూడా ఆయన ఇంటిపై గతంలో దాడులు చేసింది. అదే సమయంలో ఆయనపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సీబీఐ పలుమార్లు అనుమతి కోరింది. దీంతో 2020లో డీకేఎస్‌పై అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ కేసు నమోదు చేసింది. ఇలా తనపై కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతోపాటు తనపై జరుగుతోన్న దర్యాప్తును సవాలు చేస్తూ డీకే శివకుమార్‌ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్నందునే సీబీఐ తనకు వరుసగా నోటీసులు ఇస్తూ మానసికంగా ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. దీంతో ఆయనపై సీబీఐ చేస్తున్న దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 10వ తేదీన మధ్యంతర స్టే విధించింది. అనంతరం ఆ స్టేను పలుమార్లు పొడిగించింది. దీంతో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సీబీఐ సవాలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని