Adani Group: సుప్రీంకు చేరిన ‘అదానీ’ వ్యవహారం.. రేపు విచారణ

దేశంలో తీవ్ర దుమారానికి దారితీసిన అదానీ గ్రూప్‌ (Adani Group) వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

Published : 09 Feb 2023 12:31 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani Group) సంస్థలపై హిండెన్‌బర్గ్‌ (Hindenburg Research) నివేదిక దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని లేదా కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని గత కొన్ని రోజులుగా పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివాదం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరింది. అదానీ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టనుంది.

అదానీ గ్రూప్‌ (Adani Group)పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్ ధర్మాసనం ముందు అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. దీనిపై శుక్రవారం (ఫిబ్రవరి 10న) విచారణ జరుపుతామని తెలిపింది. దీనిపై గతవారం కూడా సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్‌ దాఖలైంది.

అదానీ గ్రూప్ ‌(Adani Group)పై సంచలన నివేదిక ఇచ్చి ఆ సంస్థ మార్కెట్‌ విలువ పతనానికి కారణమైన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg Research) సంస్థ యజమాని నాథన్‌ అండర్సర్‌, అతడి అనుచరులపై దర్యాప్తునకు ఆదేశించాలని సీనియర్‌ న్యాయవాది ఎంఎల్‌ శర్మ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కూడా రేపు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

అదానీ గ్రూప్ ‌(Adani Group) తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్‌ (Hindenburg) ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. కాగా.. ఈ నివేదిక నేపథ్యంలో ఇటీవల అదానీ సంస్థకు చెందిన కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని