రైతుల ఉద్యమం: 19న నిపుణుల కమిటీ భేటీ!

కొత్త వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నియమించిన నిపుణుల కమిటీ తొలి భేటీ ఈ నెల 19న జరుగనున్నట్లు సభ్యుడు అనిల్‌ ఘన్వాత్‌ వెల్లడించారు.

Updated : 17 Jan 2021 18:46 IST

2024 వరకైనా మా రైతుల ఉద్యమం కొనసాగిస్తాం
భారతీయ కిసాన్‌ యూనియన్‌

దిల్లీ‌: కొత్త వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నియమించిన నిపుణుల కమిటీ తొలి భేటీ ఈ నెల 19న జరుగనున్నట్లు సభ్యుడు అనిల్‌ ఘన్వాత్‌ వెల్లడించారు.  ఈ సమావేశంలో భవిష్యత్ కార్యచరణ సిద్ధం చేస్తామని తెలిపారు. అయితే ఈ భేటీలో అనిల్‌ ఘన్వాత్‌తో పాటు డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ జోషీ, అశోక్‌ గులాటీలు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. సభ్యుల్లో మరొకరైన భూపీందర్‌ సింగ్‌ మాన్‌ కమిటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇదివరకే వెల్లడించిన నేపథ్యంలో అప్పటిలోగా సుప్రీంకోర్టు మరో సభ్యుడిని సూచించకపోతే కేవలం ముగ్గురు సభ్యులం మాత్రమే హాజరవుతామని అనిల్‌ ఘన్వాత్‌ పేర్కొన్నారు. ఇప్పటికే కమిటీ చేయాల్సిన పనిపై మార్గదర్శకాలు అందాయని.. జనవరి 21 నుంచి తమ పని ప్రారంభిస్తామని తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వంతో చర్చలు కొనసాగడంపై ఎలాంటి అభ్యంతరం లేదని..పరిష్కారం ఎక్కడ దొరికినా ఎలాంటి ఇబ్బంది లేదని అనిల్‌ ఘన్వాత్‌ అభిప్రాయపడ్డారు.

2024 వరకైనా ఉద్యమాన్ని కొనసాగిస్తాం..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని రైతు సంఘాలు స్పష్టంచేస్తున్నాయి. ప్రభుత్వం దిగిరాకుంటే మే 2024(వచ్చే లోక్‌సభ ఎన్నికల) వరకైనా ఉద్యమం చేపట్టేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలిగించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని నాగ్‌పూర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఇది కేవలం ధనిక రైతుల ఉద్యమంగా వస్తోన్న ఆరోపణలపై స్పందించిన ఆయన, మారుమూల గ్రామాల ప్రజలూ తమ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇవీ చదవండి..
ఆ ముగ్గుర్నీ తొలగించండి..
సాగు చట్టాలపై సుప్రీం స్టే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని