Farm Laws: సాగు చట్టాల రద్దును వ్యతిరేకించిన నిపుణుల కమిటీ..!

సాగు చట్టాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నందున వాటిని రద్దు చేయవద్దంటూ నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు తాజా నివేదికలో వెల్లడైంది......

Updated : 22 Mar 2022 04:28 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ చట్టాలపై భిన్న వర్గాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక తాజాగా బహిర్గతమైంది. సాగు చట్టాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నందున వాటిని రద్దు చేయవద్దంటూ నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు అందులో వెల్లడైంది. అయితే, దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీసిన నేపథ్యంలో వీటిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ నివేదికకు ప్రాధాన్యం లేకుండా పోయింది.

సాగు చట్టాలపై భారత అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక గతేడాది మార్చి 19నే సుప్రీంకోర్టుకు చేరింది. అందులో కీలక అంశాలను కమిటీ సిఫార్సు చేసింది. ముఖ్యంగా కనీస మద్దతు ధరను నిర్ణయించడంలో రాష్ట్రాలకే పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని సూచించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో సభ్యుడైన అనిల్ ఘన్వాట్ ఈ వివరాలను వెల్లడించారు.

‘మార్చి 19, 2021న సుప్రీంకోర్టుకు ఈ నివేదిక సమర్పించాం. అనంతరం ఈ నివేదికను బహిర్గతం చేయాలని కోరుతూ మూడుసార్లు లేఖలు రాశాం. కానీ, ఎటువంటి స్పందనా రాలేదు. అందుకే ఈ నివేదికను బహిర్గతం చేస్తున్నా. అయితే, ఇప్పటికే సాగు చట్టాలు రద్దు అయినందున దీనికి ఎటువంటి ప్రాధాన్యం లేదు' అని పేర్కొన్నారు. అయినప్పటికీ, భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో చట్టాలు రూపొందించే క్రమంలో ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి’ అని అనిల్ ఘన్వాట్‌ వెల్లడించారు.

అయితే, వీటిని రద్దు చేయడం లేదా చాలాకాలం పాటు పక్కకుపెట్టడం వంటివి సాగుచట్టాలకు మద్దతు తెలిపే వారికి అన్యాయంగా మారుతుందన్నారు. కమిటీ ముందుకు వచ్చిన 73 రైతు సంఘాల్లో 61 సంఘాలు సాగు చట్టాలకు మద్దతు తెలిపాయన్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో ఏర్పాటైన 40 సంఘాలు మాత్రం తమ అభిప్రాయాలను కమిటీ ముందు చెప్పలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని