Supreme Court: దేశమంతా తిరిగి ఇంటర్వ్యూలు చేశాం కదా.. ఇదేం ఎంపిక?

ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు మరోసారి విచారం వ్యక్తం చేసింది. ఖాళీల భర్తీపై దాఖలపై పిటిషన్లపై బుధవారం

Updated : 15 Sep 2021 14:14 IST

ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీ విషయంలో కేంద్రం తీరుపై సుప్రీం ఆగ్రహం

దిల్లీ: ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు మరోసారి విచారం వ్యక్తం చేసింది. ఖాళీల భర్తీకి సంబంధించి దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. సభ్యుల ఎంపిక విధానాన్ని తప్పుబట్టింది. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ తాము ఎంతో కష్టపడి దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూలు చేసి, కొందరి పేర్లను సిఫార్సు చేస్తే.. వాటిని కేంద్రం పక్కనబెట్టడంపై ఆగ్రహించింది. ఖాళీల భర్తీ విషయంలో ఇప్పటికే కోర్టు చాలా సహనం పాటించిందని.. రెండు వారాల్లోగా అపాయింట్‌మెంట్‌ లెటర్లతో రావాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీపై కోర్టు ఎన్నిసార్లు ఆదేశాలిచ్చినా కేంద్రం పట్టించుకోకపోడంపై గతవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల్లోగా నియామకాలు చేపట్టాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో కేంద్రం హడావుడిగా పలు ట్రైబ్యునళ్లలో నియామకాలు చేపట్టి 84 మంది సభ్యులను నియమించింది. అందుకు సంబంధించిన వివరాలతో కూడిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు సమర్పించింది.

ఈ అఫిడవిట్‌ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. ఖాళీల భర్తీ, ఎంపిక విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు జడ్జీల ఆధ్వర్యంలోని సెర్చ్‌ అండ్‌ సెలక్షన్‌ కమిటీ సిఫార్సు చేసిన వ్యక్తులను కాకుండా వెయిట్‌ లిస్ట్‌లో నుంచి సభ్యులను ఎంపిక చేయడంపై ఆగ్రహించింది. ‘‘ఎన్‌సీఎల్‌టీ కోసం సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసిన జాబితాను చూశాం. ఈ ట్రైబ్యునల్‌ కోసం 9 మంది జ్యుడీషియల్‌ సభ్యులు, 10 మంది టెక్నికల్‌ సభ్యులను కమిటీ ప్రతిపాదించింది. కానీ ఈ జాబితా నుంచి కేవలం ముగ్గురిని మాత్రమే ఎంపిక చేసి అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చారు. మిగతా వారిని వెయిటింగ్‌ లిస్ట్‌ నుంచి తీసుకున్నారు. సెలక్ట్‌ లిస్ట్‌ను పక్కనబెట్టి వెయిట్‌ లిస్ట్‌లో నుంచి సభ్యులను ఎంపిక చేయకూడదు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. రూల్‌ ఆఫ్‌ లా.. రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలి’’ అని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ వ్యాఖ్యానించారు. 

‘‘ట్రైబ్యునళ్లలో భర్తీల ఇంటర్వ్యూలు చేపట్టాలని ప్రభుత్వం కోరింది. అందుకే కొవిడ్‌ సమయంలోనే మేం దేశవ్యాప్తంగా తిరిగాం. ఎంతో సమయం వెచ్చించి ఇంటర్వ్యూలు చేశాం. అందులో నుంచి కొందరిని ఎంపిక చేసి సెలక్ట్‌ జాబితాను పంపించాం. కానీ మా ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. సెలక్ట్‌ జాబితా నుంచి అందర్నీ నియమించలేమని కేంద్రం చెబుతోంది. మా సమయాన్ని వృథా చేసుకున్నాం’’ అంటూ చీఫ్‌ జస్టిస్‌ అసహనం వ్యక్తం చేశారు.

దీనికి అటార్నీ జనరల్ స్పందిస్తూ.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే నియామకాలు చేపట్టామని తెలిపారు. సభ్యుల ఎంపికపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని దీనిపై వారం రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేస్తామని ఏజీ తెలిపారు. అయితే ఇందుకు కోర్టు తిరస్కరించింది. ఈ సమస్యకు కౌంటర్‌ దాఖలు చేయడం పరిష్కారం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్రానికి రెండు వారాలు గడువు కల్పిస్తున్నామని, ఆలోగా సరైన సభ్యులతో నియామకాలు చేపట్టి.. అపాయింట్‌మెంట్‌ లెటర్లతో తమ వద్దకు రావాలని ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు