Joshimath: సోషల్‌మీడియా ప్రచారం కోసం ఇక్కడకు రావొద్దు.. జోషీమఠ్‌పై విచారణకు సుప్రీం నో..!

కేవలం సోషల్‌మీడియాలో ప్రచారం కోసం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయొద్దని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం తెలిపింది. జోషీమఠ్‌ (oshimath)ను జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Published : 16 Jan 2023 18:27 IST

దిల్లీ: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని జోషీమఠ్‌ (Joshimath)లో భూమి కుంగడాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. కేవలం సోషల్‌మీడియాలో ప్రచారం కోసం సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్లు వేయొద్దని.. ఈ ఘటనపై హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

జోషీమఠ్‌లో భూమి కుంగిపోతుండటంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ అవిముక్తేశ్వరానంద సరస్వతి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో పాటు అక్కడి బాధితులకు పరిహారం, ఆర్థిక సాయం అందించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ‘‘హైకోర్టు విస్తృత అంశాలపై దృష్టిపెడుతుంది. అందువల్ల ఈ పిటిషన్‌తో అక్కడకు వెళ్లేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ కల్పిస్తున్నాం. జోషీమఠ్‌ (Joshimath) అంశంపై పిటిషనర్‌ హైకోర్టు ముందు కొత్త పిటిషన్‌ వేసుకోవచ్చు. లేదా అక్కడ ఉన్న పెండింగ్‌ పిటిషన్లలో వ్యాజ్యదారుడిగా చేరొచ్చు. ఈ అభ్యర్థనను విచారించేందుకు ఉన్నత న్యాయస్థానానికి అనుమతినిస్తున్నాం’’ అని ధర్మాసనం వెల్లడించింది.

అయితే.. జోషీమఠ్‌ (Joshimath) తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దీనిపై విచారణ జరపాలని, బాధితులకు ఉపశమనం కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘సోషల్‌మీడియాలో ప్రచారం కోసం సుప్రీంకోర్టు వాదనలను ఉపయోగించుకోవద్దు. మీకు కావాల్సింది బాధితులకు ఉపశమనం. దానికి హైకోర్టుకు వెళ్లొచ్చు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని