Hijab Row: హిజాబ్‌ వివాదంపై సుప్రీంలో భిన్న తీర్పులు..!

హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్‌ హేమంత్‌ గుప్తా సమర్థించగా.. విద్యార్థుల చదువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జస్టిస్‌ ధులియా అభిప్రాయపడ్డారు.

Updated : 13 Oct 2022 13:34 IST

దిల్లీ: కర్ణాటకలో హిజాబ్‌ బ్యాన్‌ వివాదంపై సుప్రీంకోర్టులో భిన్న తీర్పులు వెలువడ్డాయి. ఈ అంశంపై గతంలో సుదీర్ఘంగా విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తాజాగా దానిపై ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ భిన్న తీర్పులు వెలువరించారు. వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్‌ హేమంత్‌ గుప్తా సమర్థించగా.. విద్యార్థుల చదువులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జస్టిస్‌ సుధాంశు ధులియా అభిప్రాయపడ్డారు. దీంతో తుది తీర్పు కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధర్మాసనానికి ఈ కేసును సిఫార్సు చేస్తున్నట్లు జస్టిస్‌ హేమంత్‌ గుప్తా వెల్లడించారు.

విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై కర్ణాటక ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. స్కూల్‌ యూనిఫాంపై విద్యా సంస్థల నిబంధనలను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దానిపై తాజాగా విచారణ జరిగింది. ఈ క్రమంలో ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. జస్టిస్ గుప్తా హైకోర్టు తీర్పును సమర్థించారు. పిటిషన్లను తోసిపుచ్చారు. మరోపక్క జస్టిస్‌ సుధాంశు ధులియా స్పందిస్తూ.. ‘దీనిపై నాది భిన్నమైన అభిప్రాయం. నా ప్రాధాన్యం ఆడపిల్లల విద్యకే. ఈ విషయంలో నా సోదర న్యాయమూర్తితో మర్యాదపూర్వకంగా విభేదిస్తున్నాను. ఆ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నాను’అని వెల్లడించారు. భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఈ కేసును సీజేఐ ధర్మాసనానికి సిఫార్సు చేస్తున్నట్లు చెప్పారు. 

విద్యాసంస్థల్లో హిజాబ్‌ వస్త్రధారణపై కొద్దినెలల క్రితం కర్ణాటకలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పలు జిల్లాల్లో హిజాబ్‌కు మద్దతుగా- వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. ఇదే సమయంలో హిజాబ్‌ వస్త్రధారణకు అనుమతి ఇవ్వాలంటూ పలువురు విద్యార్థినులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం హిజాబ్‌ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదంటూ తుది తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని