Demonetisation: నోట్ల రద్దుపై రికార్డులు సమర్పించండి.. కేంద్రం, ఆర్‌బీఐకి సుప్రీం ఆదేశాలు

నోట్ల రద్దు(denomination)ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ నిర్ణయానికి సంబంధించిన రికార్డులను సమర్పించాలని కేంద్రం, ఆర్‌బీఐని ఆదేశించింది.

Updated : 07 Dec 2022 14:54 IST

దిల్లీ: ఆరేళ్ల క్రితం నాటి నోట్ల రద్దు (denomination)ను సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ ముగించింది. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ 2016లో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ RBI)ను ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. దీనికి అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి స్పందిస్తూ.. సంబంధిత రికార్డులను సీల్డ్‌ కవర్‌లో సమర్పిస్తానని తెలిపారు.

2016 నవంబరు 8న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొంతకాలంగా విచారణ జరిపింది. అయితే నోట్ల రద్దు నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరం లేదని గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వాదించింది. ‘‘కేవలం నల్లధనం కోణంలోనే కాకుండా, విస్తృత కోణంలో నాటి నిర్ణయాన్ని చూడాలి. ఏదైనా పనిలో ఒక వ్యక్తి విఫలమైనంత మాత్రాన.. ఆయన ఉద్దేశం లోపభూయిష్టమైనదని చెప్పడం సరికాదు’’ అని కేంద్రం తరఫున ఏజీ పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని