Taj Mahal: అదో ‘ప్రచార ప్రయోజనాల వ్యాజ్యం’.. పిల్‌పై మండిపడ్డ సుప్రీం

తాజ్‌మహల్‌ చరిత్రపై దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు.. పిటిషినర్‌ చేసిన విజ్ఞప్తిలో ప్రజాప్రయోజనం లేదని పేర్కొంది. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమేనని అభిప్రాయపడుతూ పిల్‌ను తోసిపుచ్చింది.

Published : 21 Oct 2022 14:27 IST

దిల్లీ: తాజ్‌మహల్‌ చరిత్రపై దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై (PIL) భారత అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) మండిపడింది. ఆ ప్రాచీన కట్టడం ప్రాంగణంలోని 22 గదులను తెరవాలని చేసిన విజ్ఞప్తిలో ప్రజాప్రయోజనం లేదని.. అది ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమే (Publicity Interest Litigation)నని అభిప్రాయపడింది. దీనిని తోసిపుచ్చుతూ గతంలో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

తాజ్‌మహల్‌ (Taj Mahal) చరిత్రతో పాటు ఆ ప్రాంగణంలోని 22 గదులు తెరవడంపై విచారణ జరపాలని దాఖలైన వ్యాజ్యాన్ని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం పరిశీలించింది. ‘ఈ పిటిషన్‌ను కొట్టివేయడంలో హైకోర్టు తప్పేమీ లేదు. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యం మాత్రమే. దీనిని తోసిపుచ్చుతున్నాం’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

తాజ్‌మహల్‌ అంశానికి సంబంధించి ఆయోధ్యకు చెందిన భాజపా నేత, మీడియా ఇంఛార్జ్‌ రజ్‌నీశ్‌ సింగ్‌ అలహాబాద్‌ హైకోర్టులో గతంలో ఓ పిల్‌ దాఖలు చేశారు. పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. న్యాయపరమైన, రాజ్యాంగ హక్కులకు ఏవిధంగా భంగం కలిగిందో చెప్పడంలో పిటిషనర్‌ విఫలమయ్యారని పేర్కొంది. పిటిషనర్‌ తరఫున న్యాయవాదిని మందలించిన హైకోర్టు.. ఆ వ్యాజ్యాన్ని మే 12న కొట్టివేసింది. దానిని సవాలు చేస్తూ  ఇటీవల సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసినప్పటికీ ఇక్కడా చుక్కెదురయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని