Jahangirpuri: జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌.. కలగజేసుకున్న సుప్రీం

దేశ రాజధాని నగరం దిల్లీలోని జహంగీర్‌పురిలో ఘర్షణ వాతావారణం నెలకొని ఉంది. ఆ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను వ్యతిరేకంగా ఉత్తర దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం చర్యలు ప్రారంభించగా.. సుప్రీంకోర్టు కలగజేసుకుంది.

Published : 20 Apr 2022 12:47 IST

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలోని జహంగీర్‌పురిలో ఘర్షణ వాతావారణం నెలకొంది. ఆ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను వ్యతిరేకంగా ఉత్తర దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం చర్యలు ప్రారంభించగా.. సుప్రీంకోర్టు కలగజేసుకుంది. నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌ను వెంటనే నిలిపివేయాలని, యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అలాగే దీనికి సంబంధించిన విచారణను రేపు చేపడతామని తెలిపింది. మరోపక్క స్థానిక యంత్రాంగం చర్యపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. 

ఇటీవల జహంగీర్‌పురిలో కొన్ని వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అల్లరిమూకల అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలంటూ దిల్లీ భాజపా చీఫ్ ఆదేశ్ గుప్తా సదరు మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ ప్రారంభమైంది. ఈ డ్రైవ్ రోజూవారీ కార్యకలాపాల్లో భాగమేనని మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ వెల్లడించారు. ఈ లేఖ రాసిన సమయంలో ఈ చర్యలు చేపట్టడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా.. సుప్రీం ఆదేశాల మేరకు తాము ఈ కూల్చివేత ప్రక్రియను నిలిపివేస్తామని ఇక్బాల్ వెల్లడించారు. 

బుల్డోజర్లను స్విచ్ఛాఫ్ చేయండి: రాహుల్ గాంధీ

ఈ డ్రైవ్ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. వెంటనే ద్వేషపూరిత బుల్డోజర్లను ఆపివేయండని విమర్శించారు. ‘ఈ ఎనిమిది సంవత్సరాల పాలన ఫలితంగా కేవలం ఎనిమిది రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. మోదీజీ.. ద్రవ్యోల్బణం ఆకాశన్నంటుతోంది. విద్యుత్ కోత చిన్న పరిశ్రమలను ధ్వంసం చేస్తోంది. ఇది మరింత నిరుద్యోగానికి దారితీస్తుంది. అందుకే ద్వేషపూరిత బుల్డోజర్లను ఆపివేసి, పవర్ ప్లాంట్లను ఆన్‌ చేయండి’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని