సుప్రీంను ఆశ్రయించిన నందిగ్రామ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌!

మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న నందిగ్రామ్‌ స్థానం ఎన్నికల ఏజెంట్‌గా ఉన్న వ్యక్తి సుప్రీం కోర్టు తలుపుతట్టారు. అతనిపై గతంలో ఉన్న ఎఫ్‌ఐఆర్‌లను తిరిగి తెరవడంపై సుప్రీం కోర్టు విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

Published : 27 Mar 2021 01:33 IST

అత్యవసర విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న నందిగ్రామ్‌ స్థానం ఎన్నికల ఏజెంట్‌గా ఉన్న వ్యక్తి సుప్రీం కోర్టు తలుపుతట్టారు. అతనిపై గతంలో ఉన్న ఎఫ్‌ఐఆర్‌లను తిరిగి తెరవడంపై సుప్రీం కోర్టు విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీనికి అంగీకరించిన సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ ప్రారంభించింది.

నందిగ్రామ్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తోన్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరపున చీఫ్ ఎలక్షన్‌ ఏజెంట్‌గా ఎస్‌కే సుపియన్‌ బాధ్యతలు స్వీకరించారు. 2007-2009లో నందిగ్రామ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆయన మీద పలు క్రిమినల్‌ కేసులు నమోదయ్యియి. అయితే, దీదీ ప్రభుత్వం ఆ కేసులను 2020 సంవత్సరంలో ఉపసంహరించుకుంది. కానీ, కొన్ని వారాల క్రితం కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఆయనపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌లు మళ్లీ తెరుచుకున్నాయి. ఆ కేసుల్లో ఉన్న వారిని అరెస్టు చేయాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశించడంతో ముందస్తు బెయిల్‌ కోసం సుపియన్‌ దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీటిపై విచారణ జరపాలని ఎస్‌కే సుపియన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అందుకు అంగీకరించిన చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారమే విచారణ మొదలుపెట్టింది.

ముగిసిన కేసులను తిరిగి తెరవడం వంటి చర్యలు రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తున్నాయని ఎస్‌కే సుపియన్‌ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల ఏజెంట్‌ ఉన్న వ్యక్తి తన విధులను నిర్వర్తించే సామర్థ్యాన్ని హైకోర్టు ఉత్తర్వులు దెబ్బతీసేవిగా ఉన్నాయని సుప్రీం కోర్టు ధర్మాసనానికి విన్నవించారు. అటు ఎస్‌కే సుపియన్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సమర్థించింది. ఒకసారి కేసును ఉపసంహరించుకున్న తర్వాత ఎఫ్‌ఐఆర్‌ పునరుద్ధరించలేమని ప్రభుత్వం తరపున న్యాయవాది ఏఎం సింఘ్వీ సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలు చట్టప్రకారం సరైనవి కావని వాదించారు.

వాదనలు విన్న చీఫ్‌ జస్టిస్‌ ఈ పిటిషన్‌ను హోళీ సెలవుల అనంతరం (ఏప్రిల్‌ 4 తర్వాత) విచారిస్తామని తొలుత వెల్లడించారు. అయితే, నందిగ్రామ్‌ అసెంబ్లీ స్థానంలో ఏప్రిల్ ఒకటో తేదీనే ఎన్నికలు ఉన్నాయని పిటిషనర్‌ తరపు న్యాయవాది సీజేఐకి గుర్తుచేశారు. దీంతో సెలవుల సమయంలో ప్రత్యేక బెంచ్‌ కేసు విచారణ చేపట్టే అవకాశం ఉంటుందని చీఫ్‌ జస్టిస్‌ పిటిషినర్‌కు సూచించారు.

ఇదిలాఉంటే, 2007-2009లో నందిగ్రామ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల కేసులను తిరిగి తెరవాలని మార్చి 5వ తేదీన కోల్‌కతా హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, అప్పటి కేసులను తిరిగి తెరవాలంటూ మార్చి 15న ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగానే అప్పట్లో నమోదైన కేసుల్లో సుపియన్‌పై ఉన్న క్రిమినల్‌ కేసులు తెరుచుకున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తోన్న వేళ తాజా పరిణామాలు ఆసక్తిగా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని