టీకా ఎంపికపై స్పష్టతనిచ్చిన కేంద్రం!

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఎంపిక చేసుకునే సౌలభ్యం లేదని, వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ మొత్తం కొవిన్‌ వ్యవస్థ ద్వారానే జరుగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Published : 01 Mar 2021 22:35 IST

దిల్లీ: ప్రభుత్వం అందించే కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఎంపిక చేసుకునే సౌలభ్యం లేదని, వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ మొత్తం కొవిన్‌ వ్యవస్థ ద్వారానే జరుగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇక సుప్రీంకోర్టు ప్రాంగణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన (సీజీహెచ్‌ఎస్‌ డిస్పెన్సరీ) కేంద్రంలో న్యాయమూర్తులు, సిబ్బంది వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్యశాఖ పేర్కొంది.

దేశవ్యాప్తంగా కొవిడ్‌ టీకా పంపిణీ రెండో దశ నేటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన రెండు వ్యాక్సిన్లలో ఏదో ఒకదాన్ని ప్రభుత్వ నిర్దేశానుసారం పంపిణీ చేస్తున్నారు. సుప్రీంకోర్టులోనూ మంగళవారం నుంచి న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో వారికి వ్యాక్సిన్‌ను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉందనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్యశాఖ, వ్యాక్సిన్‌ ఎంపిక చేసుకునే సౌలభ్యం లేదని స్పష్టం చేసింది.

రెండు వ్యాక్సిన్‌లు సమర్థవంతమైనవే..

ప్రస్తుతం దేశంలో అందుబాటులోకి వచ్చిన రెండు వ్యాక్సిన్‌లు సమర్థవంతమైనవేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ స్పష్టంచేశారు. ముఖ్యంగా స్వదేశీ వ్యాక్సిన్‌ సమర్థతపై భిన్న ప్రచారాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వదేశీ వ్యాక్సిన్‌ ‘కొవాగ్జిన్‌’ తీసుకోవడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యావత్‌ దేశానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు కొవాగ్జిన్‌పై ఉన్న అనుమానాలు పూర్తిగా తొలగిపోయాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఇక రెండో విడత పంపిణీలో భాగంగా 60ఏళ్ల వయసుపైబడిన వారికి  కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అందజేసే కార్యక్రమం మార్చి 1 నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ కేంద్రాలలో ఉచిత టీకా అందిస్తుండగా, ప్రైవేటులో రూ.250 చెల్లించి వ్యాక్సిన్‌ తీసుకునే సౌలభ్యం ఉంది. అయితే, వ్యాక్సిన్‌ తీసుకోదలచిన వారు కొవిన్‌ పోర్టల్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ఇందులో భాగంగా తొలిరోజు మధ్యాహ్నం ఒంటిగంట వరకే పదిలక్షల మంది కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే, ప్లే స్టోర్‌లో ఉండే కొవిన్‌ యాప్‌ కేవలం అధికారులకు మాత్రమేనని, ఇతరులు cowin.gov.in ద్వారా మాత్రమే పేరు నమోదు చేసుకోవాలని స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని