Women in NDA: మహిళల హక్కులను నిరాకరించలేం.. ఎన్‌డీఏ పరీక్షకు అనుమతించాల్సిందే!

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) ప్రవేశపరీక్షలకు మహిళల్ని అనుమతించడాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది....

Updated : 22 Sep 2021 15:44 IST

సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) ప్రవేశపరీక్షలకు మహిళల్ని అనుమతించడాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహిళలకు దక్కాల్సిన హక్కుల్ని నిరాకరించలేమని వ్యాఖ్యానించింది. మహిళలను ఎన్‌డీఏలోకి అనుమతించే అవకాశాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది.

స్త్రీ-పురుష సమానత్వం దిశగా సైన్యంలో చేరడానికి ఉద్దేశించిన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) ప్రవేశపరీక్షల్లో మహిళలు పాల్గొనడానికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. రాబోయే పరీక్షల్లో మహిళా అభ్యర్థులు పాల్గొనడానికి వీలుగా నోటిఫికేషన్‌ ఇచ్చి తగిన ఏర్పాట్లు చేయాలని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ను ఆదేశించింది. అయితే పరీక్షల ఫలితాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయంటూ న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే, ఈ ఏడాది నవంబరు 14న జరిగే ఎన్‌డీఏ పరీక్షలకు మహిళలను అనుమతించే విషయంలో మినహాయింపునివ్వాలని కేంద్రం కోరింది. వచ్చే ఏడాది మే నెలలో జరిగే పరీక్షల నుంచి మహిళలకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. కానీ, కోర్టు అందుకు నిరాకరించింది. సైనిక దళాలు అనేక అత్యవసర సంక్షోభాలను సునాయసంగా అధిగమించాయని.. దీన్ని కూడా సమర్థంగా పరిష్కరించగలవని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని