Supreme Court: అంత సూపర్ ఫాస్ట్ నియామకం దేనికీ..? ఈసీగా గోయల్ ఎంపికపై సుప్రీం వ్యాఖ్య

కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు పెదవివిరిచింది. ఒక్క రోజులోనే ఆ ప్రక్రియ ఎలా పూర్తిచేశారని కేంద్రాన్ని ప్రశ్నించింది.

Updated : 24 Nov 2022 13:07 IST

దిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌ను ఎందుకంత వేగంగా నియమించారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గోయల్‌ నియామకానికి సంబంధించిన ఫైళ్లను ‘మెరుపువేగం’తో ఆమోదించడంపై సర్వోన్నత న్యాయస్థానం పెదవి విరిచింది. 24 గంటలు కూడా గడవకముందే మొత్తం నియామక ప్రక్రియ ఎలా పూర్తి చేశారని రాజ్యాంగ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకానికి కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారిస్తున్న జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అరుణ్‌ గోయల్‌ నియామకంపై బుధవారం ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. ఆయన నియామక దస్త్రాలను కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి గురువారం సమర్పించారు.

ఒక్క రోజులోనే ఎంపిక చేశారా?

ఈ దస్త్రాలను పరిశీలించిన రాజ్యాంగ ధర్మాసనం.. కేంద్రం తీరుపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఇదేం నియామకం? ఇక్కడ మేం అరుణ్‌ గోయల్‌ సామర్థ్యాలను  ప్రశ్నించట్లేదు. నియామక ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం. గోయల్ ఫైల్‌ను ఎందుకంత హడావుడిగా, వేగంగా ఆమోదించాల్సి వచ్చింది. ఫైల్‌ మొదలుపెట్టిన రోజే అపాయింట్‌మెంట్ ఎలా జరిగింది. ఈసీ పదవి కోసం నలుగురి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసిన న్యాయశాఖ నవంబరు 18న ఆ ఫైల్‌ను ప్రధాని కార్యాలయానికి పంపించింది. అదే రోజున ప్రధాని ఒక పేరును ప్రతిపాదించారు. నలుగురి పేర్లను సిఫార్సు చేస్తే... వారిలో చిన్నవాడైన అరుణ్‌ గోయల్‌ పేరును ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు. దీనికి అనుసరించిన పద్ధతి ఏంటీ?’’ అని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.

మే15వ తేదీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉందని.. నాటి నుంచి నవంబరు 18వ తేదీ వరకు ఏం జరిగిందో చెప్పాలని రాజ్యాంగ ధర్మాసనం ఏజీని నిలదీసింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టడం, అనుమానాల నివృత్తి కోసం వేసే ప్రశ్నల ద్వారా... కేంద్రానికి తాము వ్యతిరేకమని అర్థం చేసుకోకూడదని రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ తెలిపారు.

సుప్రీం ప్రశ్నలకు అటార్నీ జనరల్‌ స్పందిస్తూ.. ‘‘ఎన్నికల కమిషనర్‌ ఎంపిక ప్రక్రియలో ఎక్కడా తప్పు జరగలేదు. గతంలో కూడా 12 నుంచి 24 గంటల్లో నియామకాలు జరిగిన సందర్భాలున్నాయి. న్యాయశాఖ ప్రతిపాదించిన నాలుగు పేర్లను డీఓపీటీ డేటాబేస్‌ నుంచే తీసుకున్నారు. ఆ వివరాలన్నీ బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయి. ఇక, పేరు ఎంపిక సమయంలో సీనియార్టీ, పదవీ విరమణ వయసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వయసుకు బదులుగా బ్యాచ్‌ ఆధారంగా సీనియార్టీని పరిగణిస్తారు’’ అని బదులిచ్చారు. సుప్రీం తీరుతో ఎగ్జిక్యూటివ్‌లోని చిన్న చిన్న విషయాలను కూడా సమీక్షిస్తారా అనే ప్రశ్న తలెత్తుతోందని ఏజీ అన్నారు. ధర్మాసనం ఈ కేసులోని పూర్తి అంశాలను పరిశీలించాలని ఏజీ కోరారు.

తీర్పు రిజర్వ్‌..

ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు, స్వయం ప్రతిపత్తి అంశంపై దాఖలైన పిటిషన్లపై నాలుగు రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన రాజ్యాంగం ధర్మాసనం.. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో లిఖితపూర్వక వాదనలు దాఖలు చేసేందుకు వాద, ప్రతివాదులకు ఐదు రోజుల సమయం ఇచ్చింది. ఈసీ, సీఈసీలను పారదర్శకంగా నియమించడానికి స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలా? వద్దా? అన్న దానిపై సుప్రీంకోర్టు త్వరలో తీర్పు ఇవ్వనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని