Supreme Court: పాముకాటుతో చంపించడం ఓ ట్రెండ్‌ అయ్యింది.. బెయిల్‌ ఇవ్వలేం..!

ప్రమాదవశాత్తూ పాము కాటుతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు దేశంలో చాలా చోట్ల జరుగుతాయి. అయితే ఉద్దేశపూర్వకంగా హత్య చేయడం కోసం పామును ఆయుధంగా

Published : 07 Oct 2021 11:34 IST

దిల్లీ: ప్రమాదవశాత్తూ పాము కాటుతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు దేశంలో చాలా చోట్ల జరుగుతాయి. అయితే ఉద్దేశపూర్వకంగా హత్య చేయడం కోసం పామును ఆయుధంగా వాడుకోవడం క్రూరమైన నేరం అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తోందని రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ తన అత్తను పాము కాటుతో చంపించిన ఘటనలో నిందితులకు బెయిల్‌ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. 

ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘పాములు ఆడించేవారి నుంచి విషపూరితమైన పాములను తీసుకొచ్చి వ్యక్తులను చంపించడం, పాము కాటుతో ప్రమాదవశాత్తూ చనిపోయిందని నమ్మించడం ఇప్పుడో కొత్త ట్రెండ్‌ అయిపోయింది. రాజస్థాన్‌లో ఇలాంటి నేరాలు తరచూ జరుగుతున్నాయి. ఈ కేసులో నిందితులకు బెయిల్‌ ఇవ్వడం కుదరదు’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

కేసు వివరాలివి..

2019లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని ఝంఝున్‌ జిల్లాకు చెందిన అల్పనకు సైన్యంలో పనిచేస్తున్న వ్యక్తితో వివాహం జరిగింది. విధుల రీత్యా అల్పన భర్త దూరంగా ఉండటంతో ఆమె ఝుంఝున్‌లో అత్త సుబోధ్‌ దేవితో కలిసి నివసిస్తోంది. సుబోధ్‌ దేవి భర్త కూడా ఉద్యోగ రీత్యా మరో ప్రాంతంలో ఉండేవారు. ఈ క్రమంలోనే అల్పనకు జైపుర్‌కు చెందిన మనీశ్‌కు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. 

అల్పన, మనీశ్‌ తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండటంతో అనుమానం వచ్చిన సుబోధ్‌ దేవి కోడలిని నిలదీసింది. దీంతో తమ ప్రేమకు అడ్డువస్తుందని భావించిన అల్పన.. అత్తను చంపేందుకు ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి కుట్ర చేసింది. మనీశ్ సాయంతో పాములు పట్టేవాడి నుంచి ఓ విషపూరిత పామును తీసుకొచ్చింది. అత్త పడుకున్న తర్వాత పామును మంచం కింద వదిలింది. నిద్రలో ఉన్న సుబోధ్‌ దేవిని పాము కాటువేయడంతో కన్నుమూసింది. ఆ తర్వాత పాము కాటుతో తన అత్త మరణించినట్లు బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే అనుమానం వచ్చిన అల్పన అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అల్పన, ఆమె ప్రియుడు, మరో వ్యక్తిని 2020లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌ కోసం వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని