SC: పార్లమెంటు ప్రారంభోత్సవంపై వ్యాజ్యం.. విచారణకు ‘సుప్రీం’ నిరాకరణ!

నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా జరిగేలా లోక్‌సభ సెక్రెటేరియట్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌ను దాఖలు చేయడం వెనుక ఉద్దేశం కోర్టుకు తెలుసని వ్యాఖ్యానించింది.

Published : 26 May 2023 14:37 IST

దిల్లీ: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవంపై (New Parliament Building) ప్రభుత్వం, విపక్షాల మధ్య వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నూతన భవనం ప్రారంభోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా జరిగేలా లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు (Supreme Court) నిరాకరించింది. జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాజ్యాన్ని (PIL) పరిశీలించింది.

ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడం వెనుక ఉద్దేశం కోర్టుకు తెలుసని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దీన్ని విచారించేందుకు నిరాకరిస్తున్నట్లు పిటిషన్‌దారు అయిన న్యాయవాది జయ సుకిన్‌కు ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలోనే తాను ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటానని పిటిషన్‌దారు విజ్ఞప్తి చేయగా.. ధర్మాసనం అంగీకరించింది. పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి  రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం ద్వారా లోక్‌సభ సెక్రెటేరియట్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిటిషన్‌దారు అంతకుముందు తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఈ నెల 28న ప్రధాని మోదీ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు. అయితే, రాష్ట్రపతి లేకుండా ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని విపక్షాలు నిలదీస్తున్నాయి. దీనికి తాము హాజరుకాబోమంటూ ఇప్పటికే 19 ప్రతిపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దీనికి ప్రతిగా భాజపా సహా 14 ఎన్‌డీఏ పక్షాలు స్పందించాయి. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు విపక్షాలు తిలోదకాలిస్తున్నాయంటూ ఆరోపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని