Ram Sethu: ‘రామసేతు’ వద్ద గోడ నిర్మించాలని PIL.. సుప్రీం కోర్టు ఏమందంటే..?

‘రామసేతు’ను (Ram Sethu) జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించడంతోపాటు ఆ ప్రాంతంలో గోడ నిర్మించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

Updated : 03 Oct 2023 17:22 IST

దిల్లీ: ‘రామసేతు’ను (Ram Sethu) జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించడంతోపాటు ఆ ప్రాంతంలో గోడ నిర్మించాలని కోరుతూ సుప్రీం కోర్టులో (Supreme Court) ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. తాజాగా దీనిని (PIL) పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. విచారించేందుకు నిరాకరించింది. ఇవి కేవలం పాలనాపరమైన అంశాలని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం.. పిటిషన్‌ను తోసిపుచ్చింది.

రామసేతు ప్రాంతంలో గోడ నిర్మాణం చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ హిందూ పర్సనల్‌ లా బోర్డు (Hindu Personal Law Board) అధ్యక్షుడు అశోక్‌ పాండే సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇప్పటికే భాజపా నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిల్ పెండింగులో ఉందని గుర్తుచేసిన ఆయన.. ఆ పిటిషన్‌తో దీన్ని కూడా జతచేయాలని కోరారు. తాజా పిటిషన్‌ను జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాన్షు ధులియా ధర్మాసనం పరిశీలించింది. ‘గోడ నిర్మించాలని కోర్టు ఎలా ఆదేశిస్తుంది. ఇది పాలనాపరమైన వ్యవహారం. దీన్ని మేమెందుకు చూడాలి’ అని పేర్కొంది. అంతేకాకుండా జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని దాఖలైన పిల్‌తో దీన్ని జత చేయాలని పిటిషనర్‌ కోరినప్పటికీ.. అందుకు కూడా సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.

‘సేతు సముద్రం’ నిర్మాణానికి అడుగులు పడేనా?

రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో గతంలోనే ఓ పిల్‌ దాఖలు చేశారు. స్మారక చిహ్నమా? కాదా అనే విషయాన్ని తేల్చకుండా కేంద్రం ఏళ్లతరబడి నాన్చుతోందని తన పిటిషనులో ఆక్షేపించారు. గతేడాది నవంబరులో దీన్ని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమాకొహ్లీ, జస్టిస్‌ జేబీ పార్దీవాలాల ధర్మాసనం.. దీనిపై కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇక అడమ్స్‌ బ్రిడ్జ్‌గా పిలిచే ఈ రామసేతుకు సంబంధించి అనేక అంశాలపై చాలా కాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని