Population control: జనాభా నియంత్రణపై జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు

దేశంలో జనాభా నియంత్రణకు సమర్థవంతమైన నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. అయితే దీన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Published : 18 Nov 2022 16:10 IST

దిల్లీ: దేశంలో జనాభా నియంత్రణకు తగిన చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, దీనిపై ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

దేశంలో జనాభా నియంత్రణకు సమర్థ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేగాక, ప్రభుత్వ ఉద్యోగాలు, ఓటు హక్కు, ఇతర సబ్సీడీలకు ఇద్దరు పిల్లల నిబంధనను తప్పనిసరి చేసేలా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పిటిషనర్‌ కోరారు. జనాభా నియంత్రణ విషయంలో గతంలో ‘లా కమిషన్’ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.

అయితే, ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ ఏఎస్‌ ఓకా ధర్మాసనం నిరాకరించింది. ‘‘ఇది సామాజిక సమస్య. దీనిపై లా కమిషన్‌ ఏమని నివేదిక ఇవ్వగలదు? ఇక, ఇద్దరు పిల్లల నిబంధనను తప్పనిసరి చేయాలని మీరు కోరుతున్నారు. అది కేంద్ర ప్రభుత్వం పని. కోర్టులు ఇందులో జోక్యం చేసుకోకూడదు. ఇలాంటి విషయాలపై ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుంటాయి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఈ పిటిషన్‌ను అశ్విని ఉపాధ్యాయ ఉపసంహరించుకున్నారు. అంతకుముందు, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది. దేశంలో జనాభాను నియంత్రించేందుకు సాధ్యమైన అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని