SC: న్యాయమూర్తిగా ఎల్సీవీ గౌరీ నియామకం సరైందే.. పిటిషన్‌ కొట్టేసిన సుప్రీంకోర్టు

మహిళా న్యాయవాది ఎల్సీవీ గౌరీని మద్రాసు హైకోర్టు  అదనపు న్యాయమూర్తిగా నియమించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్‌ దాఖలవ్వగా.. ఈ వ్యవహారంలో ఆమెకు న్యాయస్థానం ఊరట కల్పించింది.

Published : 07 Feb 2023 11:59 IST

దిల్లీ: మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీని మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తి (Judge)గా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం కొట్టివేసింది. సరైన కారణాలు లేకుండా వేసిన ఈ పిటిషన్‌ను తాము అంగీకరించబోమని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌ గవాయ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు, సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే.. ఈ ఉదయం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా గౌరీ ప్రమాణస్వీకారం చేశారు.

మద్రాస్‌ హైకోర్టుకు చెందిన మదురై ధర్మాసనం విచారించే కేసుల్లో న్యాయవాది గౌరీ (LCV Gowri) కేంద్రం తరఫున వాదించారు. ఆమెకు భాజపాతో రాజకీయ సంబంధాలున్నాయనే విమర్శలతో పాటు క్రిస్టియన్లు, ముస్లింల గురించి విద్వేష ప్రసంగాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమెను మద్రాసు హైకోర్టు (Madras High Court) అదనపు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సోమవారం ఆమె నియామకానికి కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం అసాధారణ రీతిలో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసి అత్యవసర విచారణ చేపట్టింది.

‘‘ఈ పిటిషన్‌లో లేవనెత్తిన అంశం గౌరీ అర్హతలకు సంబంధించినది కాదు. ఆమె అనుకూలమైన వ్యక్తి కాదా అన్నదాని గురించి. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. అర్హతలను సవాల్‌ చేయొచ్చు. కానీ అనుకూలతల విషయానికొస్తే కోర్టు అందులో జోక్యం చేసుకోదు. ఇక, ఆమె రాజకీయ సంబంధాల విషయానికొస్తే..  అవన్నీ పరిశీలించిన తర్వాతే కొలీజియం (collegium) ఆమె పేరును సిఫార్సు చేసింది. అంతేగాక, ప్రస్తుతం ఆమెను అదనపు న్యాయమూర్తిగానే నియమించారు. ఈ పదవీకాలం పూర్తయిన తర్వాత ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా సిఫార్సు చేసే సమయంలో కొలీజియం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవచ్చు. అదనపు న్యాయమూర్తుల పనితీరు సంతృప్తికరంగా లేకపోతే వారిని శాశ్వత జడ్జీలుగా నియమించని సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి’’ అని ధర్మాసనం వెల్లడించింది. ఆమె జడ్జీగా ప్రమాణస్వీకారం చేయకుండా తాము ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేస్తూ.. పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇదిలా ఉండగా.. గౌరీ అర్హతల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగానే ఈ ఉదయం ఆమె మద్రాసు హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. అలహాబాద్‌, కర్ణాటక, మద్రాస్‌ హైకోర్టులకు 11 మంది న్యాయవాదులను జడ్జీలుగా నియమిస్తూ సోమవారం కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీరిలో న్యాయవాది గౌరీ (LCV Gowri) ఒకరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని